NTV Telugu Site icon

Tirumala Temple: శ్రీవారి భక్తులకు అలర్ట్.. 8న శ్రీవారి ఆలయం మూసివేత..

Tirumala Temple

Tirumala Temple

తిరుమల గిరులు నిత్యం భక్తులతో రద్దీగా ఉంటాయి.. ఏదైనా ప్రత్యేకమైన రోజు ఉందంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు.. అయితే, శ్రీవారి ఆలయం 12 గంటల పాటు మూసివేయనున్నారు.. గత నెలలో సూర్యగ్రహణం కారణంగా మూతబడిన శ్రీవారి ఆలయం.. ఈ సారి చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నారు. న‌వంబరు 8వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడనుంది.. ఈ సమయంలో 12 గంటల పాటు ఆలయం మూసివేస్తారు.. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు కూడా రద్దు చేశారు.. గ్రహ‌ణ స‌మ‌యంలో అన్నప్రసాద వితరణ కూడా ఉండదని అధికారులు ప్రకటించారు..

Read Also: Posani Krishna Murali: పోసానికి కీలక పదవి ఇచ్చిన సీఎం జగన్‌..

న‌వంబరు 8న చంద్రగ్రహ‌ణం కార‌ణంగా తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం 12 గంట‌ల పాటు మూసివేస్తారు. బ్రేక్ ద‌ర్శనం, శ్రీ‌వాణి, రూ.300/- ప్రత్యేక ప్రవేశ ద‌ర్శనం, ఇత‌ర ఆర్జిత సేవ‌ల‌ను అన్నీ రద్దుచేసింది టీటీడీ.. గ్రహణం కారణంగా నవంబరు 8వ తేదీ తిరుప‌తిలో జారీ చేసే ఎస్ఎస్‌డీ టోకెన్లు రద్దు చేశారు. అయితే, గ్రహణ సమయం ముగిసిన తర్వాత వైకుంఠం 2 నుండి మాత్రమే భ‌క్తుల‌ను అనుమ‌తిస్తారు. 8వ తేదీన మ‌ధ్యాహ్నం 2.39 గంట‌ల నుండి సాయంత్రం 6.27 గంట‌ల వ‌ర‌కు చంద్రగ్రహణం ఉంటుందని.. ఈ కార‌ణంగా ఉద‌యం 8.40 నుండి రాత్రి 7.20 గంట‌ల వరకు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచనున్నట్టు వెల్లడించారు.. సాధారణంగా గ్రహణం రోజుల్లో గ్రహణం తొల‌గిపోయే వరకు వంట చేయరు.. తిరుమ‌ల‌లోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్నప్రసాద భ‌వ‌నం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇత‌ర ప్రాంతాల్లో కూడా అన్నప్రసాద విత‌ర‌ణ ఉండ‌దు. తిరిగి రాత్రి 8.30 గంటల నుండి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమవుతుందని టీటీడీ స్పష్టం చేసింది.. .