NTV Telugu Site icon

YS Jagan Tirumala Visit: నేడు తిరుమలకు వైఎస్‌ జగన్‌.. మాజీ సీఎం పర్యటనపై ఉత్కంఠ..!

Ys Jagan

Ys Jagan

YS Jagan Tirumala Visit: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటన ఉత్కంఠ రేపుతోంది. శ్రీవారి దర్శనార్థం సాయంత్రం నాలుగు గంటల 50 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారాయన. అనంతరం రోడ్డు మార్గాన తిరుమల పయనమవుతారు. రాత్రి 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. రేపు ఉదయం పదిన్నరకు శ్రీవారిని దర్శించుకోనున్నారు. జగన్ కు ఘన స్వాగతం పలకడానికి వైసీపీ శ్రేణులు సిద్దమవుతున్నారు. అయితే జగన్‌ డిక్లరేషన్ ఇచ్చాకే వెళ్లాలని.. లేదంటే అలిపిరి వద్దే అడ్డుకుంటామంటూ బీజేపీ, హిందు సంఘాల హెచ్చరించాయి. దీంతో భద్రతను భారీగా పెంచారు. అటు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తిరుపతికి చేరుకున్నారు పోలీసులు. జిల్లా వ్యాప్తంగా 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. జగన్ పర్యటనతో హిందూ పరిరక్షణ సమితి, కూటమినేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 లకు ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్‌లో మీటింగ్ జరగనుంది. సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనేదానిపై ఉత్కంఠగా మారింది.

Read Also: Israel Hezbollah War : లెబనాన్‌పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. వైమానిక దాడిలో మృతిచెందిన హిజ్బుల్లా కమాండర్

జగన్‌ తిరుమల పర్యటనతో కడప జిల్లా సరిహద్దుల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. కడప జిల్లా నుండి తిరుపతికి వైసీపీకి నేతలు, కార్యకర్తలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత పంపుతున్నారు. అన్నమయ్య, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి కూడా తిరుపతి వైసీపీ శ్రేణులు వస్తారని భావిస్తున్నారు పోలీసులు. దీంతో తిరుపతికి వచ్చే దారుల్లో తనిఖీలు చేస్తున్నారు. జగన్ తిరుమల పర్యటనపై రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా పాప ప్రక్షాళన పూజలకు పిలుపు ఇచ్చిన జగన్.. రేపు తిరుమల దర్శనానికి వెళ్తారు. అయితే డిక్లరేషన్ ఇస్తేనే శ్రీవారిని దర్శించుకోవాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. జగన్ తిరుమల పర్యటనలో డిక్లరేషన్‌పై మంత్రి బాల వీరాంజనేయస్వామి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అన్య మతస్తులు దర్శనం చేసుకోవాలంటే కచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనన్నారు. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్.. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కూడా డిక్లరేషన్‌పై సంతకం చేసి స్వామివారిని దర్శించుకున్నారని గుర్తు చేశారు.

Read Also: Aha original : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నవెబ్ సిరీస్ వచ్చేస్తోంది..

తిరుమలలో జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వాలన్న కూటమి డిమాండ్‌పై రివర్స్ ఎటాక్‌ మొదలు పెట్టింది వైసీపీ… టీడీపీ చేస్తున్న ఆరోపణలు నిజాలని నిరూపిస్తే జగన్ డిక్లరేషన్ ఇస్తారన్నారు మాజీ ఎంపీ వంగా గీత. తిరుపతి లడ్డూ విషయంలో చేస్తున్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో లేదంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. దేవుడితో ఆటలు వద్దని హెచ్చరించారు వంగా గీత. డిక్లరేషన్‌పై డైలాగ్‌వార్ కంటిన్యూ అవుతుంటే.. ఇవాళ సాయంత్రం తిరుమల వెళ్లేందుకు రెడీ అవుతున్నారు వైసీపీ అధినేత జగన్. సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుమల వెళ్తారు. శనివారం అంటే రేపు ఉదయం పదిన్నర గంటల సమయంలో శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరుకు వెళ్తారు. జగన్ పర్యటనను అడ్డుకుంటామని హిందూ సంఘాలు, కూటమినేతలు ప్రకటించడంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ ప్రకటించారు. రాజకీయ దుర్బుద్ధితోనే చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, కల్తీ జరగకుండానే జరిగిందని చెబుతున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తుంటే.. డిక్లరేషన్ ఇచ్చి తీరాల్సిందే అని కూటమి నేతలు అంటున్నారు. ఈ క్రమంలో జగన్ డిక్లరేషన్‌పై ఎలా స్పందిస్తారో చూడాలి. అంతేకాకుండా.. స్వామివారి దర్శనం తర్వాత లడ్డు వివాదంపై తిరుపతి కేంద్రంగా జగన్ ఎలాంటి ప్రకటన చేస్తారా అని పొలిటికల్ సర్కిల్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.