NTV Telugu Site icon

Tirumala Garuda Seva: తిరుమల బ్రహ్మోత్సవాల్లో నేడు ముఖ్యమైన ఘట్టం.. భక్తులకు అలర్ట్..

Garuda Seva

Garuda Seva

Tirumala Garuda Seva: కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడవాహన సేవకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. ఐదవరోజైన ఇవాళ సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి పదకొండున్నర వరకు స్వామివారికి అత్యంత ప్రియమైన గరుడసేవ జరగనుంది. గరుడ వాహనంపై మలయప్ప దర్శనం సర్వ పాపహరణం గరుడ సేవ రోజున లక్ష్మీకాసుల హారం, సహస్రనామ మాల, పచ్చలహారాన్ని ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి వారికి అలంకరిస్తారు. వెన్నెల వెలుగుల్లో గరుడ వాహనంపై సర్వాలంకార భూషితుడైన శ్రీనివాసుడ్ని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. సేవ సమయంలో స్వామి ఆలయాన్ని వీడి తిరుమాడ వీధుల్లో సంచరిస్తారన్నది విశ్వాసం. దేవతలు కూడా గరుడ సేవలో స్వామిని దర్శించుకోవడానికి వస్తారని అంటారు. అందుకే లక్షలమంది గరుడవాహన సేవను వీక్షించేందుకు తిరుమల చేరుకుంటారు.

Read Also: Akhanda 2 : అఖండ 2లో బాలయ్య డైలాగ్స్ చెబితే థియేటర్ దద్దరిల్లాల్సిందే

మొత్తం మూడున్నర లక్షలమంది భక్తులు స్వామిని దర్శించుకోవడానికి వస్తారని అంచనా వేస్తున్నారు టీటీడీ అధికారులు. గ్యాలరీల్లో రెండు లక్షల మంది భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా భక్తుల దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. గరుడ వాహనంపై మలయప్పను వీక్షించేందుకు 28 భారీ డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. గరుడ వాహన సేవలో ఎలాంటి భద్రతా సమస్యలు తలెత్తకుండా భారీగా పోలీసులను మోహరించారు. తిరుమలలో 2 వేల 700 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. అలాగే ఆరు వేల మందికిపైగా భద్రతా విధుల్లో పాల్గొంటారు. మరోవైపు గరుడ సేవ సందర్భంగా తిరుమల ఘాట్‌రోడ్‌లో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు ఉదయం 9 గంటల వరకు బైక్‌లు, ప్రైవేట్‌ టాక్సీలకు అనుమతి లేదు. తిరుపతి నుంచి తిరుమలకు 400 బస్సులు సిద్ధం చేశారు. అలాగే 24 గంటల పాటు ఘాట్‌రోడ్డు, నడకమార్గం తెరిచే ఉంచుతారు.

Read Also: Amazon-MX Player: ఎంఎక్స్‌ ప్లేయర్‌ను కొనుగోలు చేసిన అమెజాన్‌.. రీ ఇన్‌స్టాల్‌, అప్‌గ్రేడ్‌ అవసరం లేదు!

గరుడ వాహన సేవ నేపథ్యంలో.. నిన్నటి నుంచే తిరుమలలో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.. నిన్న మధ్యహ్నం 2 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు ప్రైవేట్‌ ట్యాక్సీలకు ఘాట్ రోడ్డులో అనుమతి లేదని టీటీడీ స్పష్టం చేసింది.. ఇక, నిన్న రాత్రి 9 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలకు సైతం అనుమతి నిలిపివేశారు.. అయితే.. నేడు 24 గంటల పాటు ఘాట్ రోడ్డులు, నడకమార్గం తెరిచి ఉంటుందని టీటీడీ ప్రకటించింది.. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘటనమైన గరుడ వాహన సేవకు టీటీడీ సర్వం సిద్ధం చేసినట్టు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు.. మూడున్నర లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్న టీటీడీ.. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తుంది.. మాడ వీధులలో రెండు లక్షల మంది భక్తులు వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేలా ఏర్పాట్లు చేశామని.. అంతకు మించి విచ్చేసిన భక్తులకు క్యూ లైన్ల ద్వారా దర్శనానికి అనుమతిస్తామన్నారు ఈవో శ్యామలరావు.. కాగా, విశేష‌మైన గరుడ వాహనంపై సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విహరించనున్నారు ఆ శ్రీనివాసుడు.. గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఔటర్‌ రింగ్‌ రోడ్లలో వేచి ఉండే భక్తులకు.. సుపథం, సౌత్‌ వెస్ట్‌ కార్నర్‌, గోవింద నిలయం నార్త్‌ వెస్ట్‌ గేట్‌, నార్త్‌ ఈస్ట్‌ గేట్ల ద్వారా ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. వారి సౌకర్యార్థం అన్ని పాయింట్ల వద్ద అవసరమైన సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. ఇక, పార్కింగ్ స్థలాలను సులభంగా గుర్తించడానికి క్యూఆర్‌ కోడ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు.. మరోవైపు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్‌టీసీ బస్సుల్లో భక్తులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ.. తిరుపతి, కడప, చిత్తూరు, శ్రీకాళహస్తి రూట్లలో కూడా పార్కింగ్‌ స్థలాల నుంచి తిరుమలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు.