TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక అప్డేట్ ఇచ్చింది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన వివిధ రకాల దర్శన టికెట్లు, టోకెన్లను నేడు ఆన్లైన్లో విడుదల చేయనుంది. భక్తులు నిర్ణీత సమయాల్లో టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది.
టికెట్ల విడుదల షెడ్యూల్ ఇదే..
ఫిబ్రవరి 2027 నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్లను నేడు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లను విడుదల చేయనున్నారు. అలాగే రేపు ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులు ఈ షెడ్యూల్ను గమనించి ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 8 గంటలు
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కల్పించేందుకు సుమారు 8 గంటల సమయం పడుతోంది. ఇక, నిన్న మొత్తం 81,516 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి 25,547 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ ద్వారా రూ.3.81 కోట్ల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఒకవైపు ఫిబ్రవరి నెల దర్శన టికెట్ల విడుదలకు ఏర్పాట్లు జరుగుతుండగా, మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టికెట్ల బుకింగ్ సమయంలో టీటీడీ ప్రకటించిన సమయాలను పాటించాలని భక్తులకు సూచిస్తున్నారు.

