Tirumala Devotees Clash: తిరుమలలో భక్తుల రద్దీ.. క్యూ లైన్లలో పరస్పరం దాడులు.. వీడియోలు వైరల్..

Tirumala Devotees Clash

Tirumala Devotees Clash

Tirumala Devotees Clash: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి వేసవి సెలవుల రద్దీ ఎఫెక్ట్‌ తగిలింది.. తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతుండటంతో క్యూ లైన్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో కొంతమంది భక్తులు సహనం కోల్పోతూ పరస్పరం దాడులకు దిగుతున్నారు. నిన్న వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఇలాంటి సంఘటనలు గతంలో కూడా పలుమార్లు చోటుచేసుకున్నాయి. క్యూ లైన్లలో వేచి ఉండే సమయంలో సంయమనం పాటించాలని, పరస్పర సహకారంతో ముందుకు సాగాలని టిటిడి అధికారులు గతంలోనే భక్తులకు సూచించారు. అయితే కొంతమంది భక్తులు టిటిడి విజ్ఞప్తులను పట్టించుకోకపోవడం వల్ల ఈ తరహా ఘటనలు పునరావృతమవుతున్నాయని అధికారులు భావిస్తున్నారు.

×
×
Ad

ఇక, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టిటిడి పాలకమండలి సభ్యుడు సుదర్శన్ వేణు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూలై 15వ తేదీ వరకు తన సిఫార్సు లేఖల కోటాను 50 శాతానికి తగ్గించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అదనపు టీటీడీ ఈవో వెంకయ్య చౌదరికి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. భక్తుల ఇబ్బందులను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మరోవైపు.. ప్రస్తుతం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో వేలాది మంది భక్తులు బయట క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోందని టిటిడి అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే శ్రీవారిని 74,569 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 46,292 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.8 కోట్లకు చేరగా, లడ్డు ప్రసాదం విక్రయాలు 4.15 లక్షలకు నమోదయ్యాయి. మరోవైపు అన్నప్రసాద వితరణ ద్వారా సుమారు 2.7 లక్షల మంది భక్తులకు భోజన సదుపాయం కల్పించినట్లు టిటిడి వెల్లడించింది. భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే వారు సహనం పాటించాలని, టిటిడి అధికారులకు సహకరించాలని ఆలయ అధికారులు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు.