Site icon NTV Telugu

Papavinasanam Dam Boating: వెనక్కి తగ్గిన అటవీశాఖ.. వివరణపై టీటీడీ ఫైర్‌

Papavinasanam Dam Boating

Papavinasanam Dam Boating

Papavinasanam Dam Boating: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారు వెలసిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల.. సప్తగిరులపై స్వామి వారు స్వయంభువై సాలిగ్రామ రూపంలో వెలసి భక్తులకు దర్శనమిస్తుంటారు. తిరుమలలో స్వామివారి ఆలయంతో పాటు అనేక పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి. స్వామి పుష్కరిణిలో 365 తీర్ధాల నీరు కలుస్తుందన్న విశ్వాసం భక్తులకు ఉండడంతో స్వామివారి పుష్కరిణిలో స్నానమాచరిస్తే మోక్షం సిద్దిస్తూందని భక్తులు విశ్వసిస్తుంటారు. మరోవైపు శేషాచలంలో 365 తీర్దాలు వెలసి ఉన్నాయి. అందులో పాపవినాశన తీర్థం అతి ప్రాధాన్యమైన, ప్రాశస్త్యం కలిగినది. పాపవినాశన తీర్థ జలాలతో స్నానమాచరిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. తిరుమలకు ఏడు కిలోమీటర్ల దూరంలో వెలసిన పాపవినాశన తీర్థం ఉన్న ప్రాంతం అటవీశాఖ పరిధిలో ఉంటుంది. 365 రోజులు పాటు ఈ తీర్దంలో నీరు ప్రవహిస్తూనే వుంటుంది. మరోవైపు తిరుమలలో భక్తుల దాహార్తిని తీర్చడానికంటూ టీటీడీ.. ఈ తీర్ద జలాలే ప్రధాన వనరులుగా 1985లో పాపవినాశన జలాశయాన్ని నిర్మించింది. పాపవినాశన తీర్థం నుంచి వచ్చే నీరుతో ఈ జలాశయం నిండి ఉంటుంది. ఈ నీటిని అటు భక్తులు పుణ్యస్నానం ఆచరించడానికి వినియోగిస్తుండగా.. మరోవైపు తిరుమల భక్తుల దాహార్తిని తీర్చడానికి వినియోగిస్తోంది టీటీడీ..

Read Also: Nagavamshi : వారంతా హాస్పిటల్ లో చేరితే బిల్లులు నేనే కడుతా : నాగవంశీ

ఇంతవరకు బాగానే ఉన్నా నిన్నటి రోజున అటవీశాఖ అధికారులు చేసిన పని టీటీడీకి తలనొప్పిగా మారింది. పాపవినాశనం డ్యామ్ లో బోటింగ్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో సెక్యూరిటీ ఆడిటింగ్ పేరుతో అటవీశాఖ అధికారులు పాపవినాశనం డ్యామ్ లో బోటింగ్ కి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణులను రప్పించారు. ఇండియన్ వాటర్ స్పోర్ట్స్ ఒలంపిక్ అసోసియేషన్ సంబంధించిన నిపుణులు నిన్న బోట్లు ద్వారా పాపవినాశన డ్యామ్ లో బోటింగ్ కి ఉన్న అవకాశాలను పరిశీలించారు. ఇదే అంశాన్ని ఎన్టీవీ వెలుగులోకి తీసుకురావడంతో అటవీశాఖ అధికారుల వ్యవహార శైలిపై వ్యతిరేకత మొదలైంది. శ్రీవారి భక్తులు, టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం ఇలా అన్ని వైపుల నుంచి అటవీశాఖ అధికారుల ప్రతిపాదనకు వ్యతిరేకత రావడంతో అటవీశాఖ అధికారులు వెనక్కి తగ్గారు. అసలు టీటీడీకి ఎలాంటి సమాచారం అందించకుండానే అటవీశాఖ అధికారులు అత్యుత్సాహంతో ఈ ప్రయత్నం చేయడం విమర్శలకు దారితీసింది..

Read Also: Congress: అమిత్ షాపై కాంగ్రెస్ ‘‘సభా హక్కుల ఉల్లంఘన నోటీసు’’..

తిరుమల పర్యాటక క్షేత్రం కాదని.. పవిత్రమైన క్షేత్రమని తిరుమలలో భక్తులు స్వామివారి నామాన్ని తప్ప మరేది జపించకూడదంటూ తిరుమల పవిత్రతను కాపాడే బాధ్యత శ్రీవారి భక్తులది అంటూ టీటీడీ పదేపదే విజ్ఞప్తి చేస్తూ ఉంటుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే వైఖరిని అవలంబిస్తుంది. సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన వెంటనే శ్రీవారిని దర్శించుకుని తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ తిరుమల పవిత్రతను కాపాడటమే తమ ప్రభుత్వ ద్యేయమని అందులో భాగంగా తిరుమల ప్రక్షాళన మొదలు పెడుతున్నామంటూ ప్రకటించారు. మరోవైపు తిరుమలను పర్యాటక క్షేత్రంగా భావించకూడదు అన్న ఆలోచనతో టీటీడీ పాలకమండలి చేసిన సూచన మేరకు అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్స్, దేవలోక్ తో పాటు మరో ప్రైవేట్ సంస్థకు కేటాయించిన 35 ఎకరాల స్థలాన్ని రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక టీటీడీ మరో అడుగు ముందుకు వేసి సైన్స్ సిటీకి కేటాయించిన 20 ఎకరాల కేటాయింపును రద్దు చేస్తూ ప్రభుత్వ పరిధిలో ఉన్న 35 ఎకరాల స్థలాన్ని కూడా టీటీడీ పరిధిలోకి ఇవ్వాలని ప్రత్యామ్నాయంగా టిటిడి మరో ప్రదేశంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్థలం కేటాయిస్తామంటూ పాలకమండలి తీర్మానం చేసింది.

Read Also: RRB ALP Recruitment 2025: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 9970 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

మరో వైపు పాలకమండలి మొదటి సమావేశంలోనే తిరుమలను పర్యాటక కేంద్రంగా భావించకూడదు అన్న ఉద్దేశంతో పలు రాష్ట్రాల పర్యాటక శాఖలకు కేటాయించిన ప్రత్యేక దర్శన టోకన్ల కోటాను రద్దు చేసింది. ఇలా తిరుమల పవిత్రతను కాపాడేందుకు టీటీడీ అడుగులు వేస్తుంటే.. అందుకు అటవీశాఖ మోకాలు అడ్డుతుంది. పాపవినాశనం డ్యామ్ లో బోటింగ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన పై వ్యతిరేకత రావడంతో దాని నుంచి యూటర్న్ తీసుకున్న అటవీశాఖ వారు.. అయితే, ఇచ్చిన వివరణ మరో వివాదానికి తెర లేపింది. పాపవినాశనం డ్యామ్ లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అనే సమాచారంతో బోట్లో పర్యవేక్షణ చేశామని అటవీశాఖ అధికారులు ఇచ్చిన వివరణ చూసి శ్రీవారి భక్తులు నవ్వుకుంటూ.. ఉంటుంటే టీటీడీ విజిలెన్స్, పోలీసులు మాత్రం మండిపడుతున్నారు. తిరుమల లాంటి పవిత్ర ప్రదేశంలో అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశాలు లేవని ఒకవేళ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అటవీశాఖ అధికారులు టీటీడీ విజిలెన్స్ తో పాటు పోలీసులకు సమాచారం అందించకుండా స్వయంగా రంగంలోకి ఎందుకు దిగారు అని ప్రశ్నిస్తున్నారు..

Exit mobile version