NTV Telugu Site icon

TTD: తిరుచానూరులో రేపటి నుంచి అమ్మవారి బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లు పూర్తి

Tiruchanur

Tiruchanur

పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబరు 28 నుంచి డిసెంబరు 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ క్రమంలో తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామలరావు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆల‌య ప‌రిస‌రాల‌లో చలువ పందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు, అమ్మవారి ఆలయం, మాడ వీధుల్లో శోభాయమానంగా విద్యుత్‌ అలంకరణలు చేపట్టామని తెలిపారు. బ్రహ్మోత్సవాలను భక్తులు వీక్షించేందుకు వీలుగా తిరుచానూరు పరిసర ప్రాంతాలతో పాటు, పద్మ పుష్కరిణికి నాలుగు వైపులా ఈసారి మొత్తం 20 ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశామని అన్నారు.

Read Also: Telangana: రేపటి నుంచి రైతు పండుగ.. రైతులకు అవగాహన కల్పించేలా వేడుకలు

మరోవైపు.. పుష్కరిణిలో భక్తులు ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు వీలుగా గేట్లు ఏర్పాటు చేసినట్లు ఈవో శ్యామలరావు తెలిపారు. అలాగే.. పంచమి రోజున 120 కౌంటర్ల ద్వారా దాదాపు 50 వేలకు పైగా భ‌క్తుల‌కు తాగునీరు, బాదంపాలు, బిస్మిల్లా బాత్, పెరుగు అన్నం, విజిటబుల్ ఉప్మాతో పాటు ఈసారి అదనంగా చెక్కెర పొంగలి అందిస్తామని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల‌కు విచ్చేసే భ‌క్తుల‌కు రోజుకు 10 వేల మందికి సాంప్రదాయ బద్ధంగా అన్నం, పప్పు, సాంబారు, రసం, స్వీట్‌తో పాటు ఈ సారి అదనంగా కర్రీని అన్నప్రసాద వితరణ చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా.. బ్రహ్మోత్సవాలలో టీటీడీ భద్రతా సిబ్బంది, పోలీసులతో కలిపి 460 మంది.. పంచమి తీర్థం రోజున 1500 మంది పోలీసులు, 600 మంది విజిలెన్స్ సిబ్బందితో క‌ట్టుదిట్టమైన భ‌ద్రత ఏర్పాట్లు చేశామని అన్నారు. బ్రహోత్సవాల రోజుల్లో 500 మంది, పంచమితీర్థం రోజు 1000 మంది శ్రీవారి సేవకులు, 200 మంది స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ భక్తులకు సేవలందిస్తార‌న్నారని చెప్పారు. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన డిసెంబరు 6వ తేదీ పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను అమ్మవారికి స‌మ‌ర్పించ‌డం ఆనవాయితీ అని టీటీడీ ఈవో శ్యామల రావు తెలిపారు.

Read Also: Pawan Kalyan Meets PM Modi: ప్రధానితో పవన్‌ కల్యాణ్‌ భేటీ.. మోడీకి డిప్యూటీ సీఎం ప్రత్యేక కృతజ్ఞతలు