NTV Telugu Site icon

Tirumala: శ్రీవారి భక్తులకు గమనిక.. నేడు అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల

Tirumala

Tirumala

Tirumala: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు అంగప్రదక్షిణం కోటా టోకెన్‌లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. శ్రీవారి దర్శన టిక్కెట్లు బుక్ చేసుకోని భక్తులు ఈ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. అంగప్రదక్షిణం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు అర్ధరాత్రి 12 గంటల సమయంలో శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి తడిబట్టలతోనే వైకుంఠం మొదటి క్యూ కాంప్లెక్స్‌లోని క్యూ వద్దకు చేరుకోవాలి. అక్కడ టికెట్, ఐడీని చెక్ చేసిన అనంతరం భక్తులను ఆలయం లోపలికి అనుమతిస్తారు. అంగప్రదక్షిణ చేసే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది. పురుషులు పంచె, పైన కండువా, స్త్రీలు చీర, లంగా వోణీ వంటివి ధరించాలి. మిగతా ఎలాంటి దుస్తులు ధరించినా అనుమతించరు.

Read Also: JEE Mains: నేటి నుంచి జేఈఈ మెయిన్స్.. గంట ముందే పరీక్ష హాలులోకి అనుమతి

అంగప్రదక్షిణం టోకెన్‌లు తీసుకున్న మహిళలు, పురుషులకు దర్శనానికి వెళ్లే సమయంలో వేర్వేరు వెయిటింగ్ హాళ్లలోకి ప్రవేశం ఉంటుంది. శ్రీవారికి సుప్రభాత సేవ మొదలైన తర్వాత భక్తులను అంగప్రదక్షిణానికి అనుమతినిస్తారు. తెల్లవారుజామున 2:45 గంటలకు తొలుత మహిళలను, ఆ తర్వాత పురుషులను అంగప్రదక్షిణానికి పంపుతారు. అంగప్రదక్షిణ పూర్తి చేసిన మహిళలు వెండి వాకిలి వద్దకు చేరుకున్నాక పురుషులను అనుమతిస్తారు. అంగప్రదక్షిణ అనంతరం భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం అందిస్తారు. కాగా బాలాలయం పనుల కారణంగా ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు అంగప్రదక్షిణ టోకెన్ల జారీని నిలిపివేసినట్టు పేర్కొంది. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించి టోకెన్లు బుక్ చేసుకోవాలని కోరింది.