కాకినాడ జిల్లాలో పెద్దపులి హడలెత్తిస్తోంది. నెల రోజులుగా జిల్లాలోని ప్రత్తిపాడు, శంఖవరం, ఏలేశ్వరం మండలాల ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మేతకు వెళ్లిన పశువులపై దాడిచేస్తూ అలజడి కలిగిస్తోంది. తాజాగా మేత కోసం వెళ్ళిన పశువులు కొన్ని కనిపించకుండా పోయాయి. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రౌతులపూడి మండలం ఎస్.పైడిపాలలో ఘటన చోటుచేసుకుంది. రెండు ఆవులు మేత కోసం కొండకు వెళ్లగా ఒక ఆవు గాయాలతో రావడంతో రైతు కంగారుపడి రెవెన్యూ, ఫారెస్టు అధికారులకు సమాచారం అందించాడు.
ఇది పులిదాడి అని నిర్ధారించి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు అటవీ అధికారులు. మరో ఆవుకోసం గాలించినా కనిపించకపోవడంతో పులి వేటాడి చంపేసిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు రైతులు. మరోవైపు దిశ మార్చుకుంటూ సమీప గ్రామాల్లో రాత్రిళ్ళు పెద్ద పులి ఎవరికి కంటికి కనపడకుండా ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. తమను హడలెత్తిస్తున్న పులిని పట్టుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
నాలుగు అడుగుల పొడవున్న యంగ్ టైగర్ ఇది. తనకు అనుకూలంగా వున్నచోటకు చేరుతూ.. రోజుకో ఊరిలో అలజడి కలిగిస్తోంది. ఈ పులిరాజాను ఎవరు పట్టుకుంటారు. అటవీ, జూ అధికారులు బోనులు, బోనులో ఎరలు ఏర్పాటుచేసినా.. వారి ఊహకు అందకుండా పులి తన వేట కొనసాగిస్తోంది. పులిని పట్టుకునేందుకు అనేక ఏర్పాట్లు చేసినా అది చిక్కడం లేదు. ఇలాంటి పరిస్థితి ఇప్పుడే ఎదురవుతోందని అధికారులు అంటున్నారు. 11 గ్రామాల ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.
ఎక్కడి నుంచి వచ్చింందో దారితప్పి తిరిగి తన దారిలోకి వెళ్లలేక అవస్థలు పడుతోంది. అలజడికి కారణం అవుతోంది. ఈ ప్రాంత ప్రజలు పులి ఎప్పుడు వచ్చి తమపై దాడికి తెగబడుతుందోనని భయం గుప్పిట్లో బతుకుతున్నారు. అంతుచిక్కని ఈ పులి కథ మన్యం పులి సినిమాను తలపిస్తోంది. పులి సాధారణంగా వేటాడి జంతువుల్ని తింటుంది. బోనులో వేసిన వాటిని తినదు. బోనులో చిక్కకుంటే మత్తుమందు ఇచ్చి అయినా పట్టుకుందామని అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు. ఈ పులి ఎప్పుడు చిక్కుతుందో..అప్పటివరకూ ఈ ప్రాంతవాసులకు కంటిమీద కునుకు కష్టమే.
Tiger Hunt: పెద్ద పులి ఎక్కడ? జనం వెన్నులో వణుకు