క్షణికావేశం, అర్థంలేని ఆకర్షణ, వివాహేతర బంధాలతో కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మూడురోజుల వ్యవధిలో ఆరు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఒకరిది అనుమానం.. మరొకరిది సమాజం ఒప్పుకోని బంధం.. ఈ రెండు పరిణామాలు రెండు కుటుంబాల్లో చీకట్లు నింపాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు మూడు రోజుల వ్యవధిలో ఆరు ప్రాణాలు పోయాయి. ఇందులో నలుగురు అభం శుభం తెలియని చిన్నారులు ఉండటం అత్యంత బాధాకరం. భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఒక మహిళ పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. భర్త అనుమానిస్తున్నాడని మరో మహిళ పిల్లలకు ఉరివేసి ఆపై తాను ఉరి తాడుకు వేలాడి జీవితం ముగించింది. ఈ రెండు సంఘటనల్లో ఎవరిది తప్పు? ఆ మహిళలు ఎందుకంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. హృదయం ద్రవించకపోయే ఈ రెండు సంఘటనలు ఒకసారి చూస్తే ఎన్నో ప్రశ్నలు మదిలో మెదులుతాయి.
పెద్దవడుగూరు మండలం కృష్టిపాడు గ్రామానికి పామిడి మండలం ఎదురూరుకు చెందిన కవితతో రామాంజనేయులుకు పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి సంతోష్ కుమార్ (11), భార్గవి (5) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కృష్టిపాడు నుంచి ఏడాది కిందట రామాంజనేయులు తాడిపత్రికి వచ్చి నివాసం ఉంటున్నారు. అక్కడ ఓ గుజరీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆరు నెలల కిందట వరకు భార్య,పిల్లలతో అన్యోన్యంగా ఉండే వాడు. కానీ కొన్ని రోజుల క్రితం రామాంజనేయులుకు మరో మహిళతో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా మరింత సన్నిహితంగా ఏర్పడింది. ఈక్రమంలో భార్యతో తరచూ గొడవ పడేవాడు.
ఇటీవల రామాంజనేయులతో గొడవలు మొదలయ్యాయి. కవిత చాలా సార్లు ఆ మహిళ గురించి ప్రస్తావించినప్పుడల్లా గొడవలు పెరిగేవి. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన కవిత పిల్లలు ఇద్దరిని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోతున్నానని భర్తకు చెప్పి వచ్చేసింది. శింగనమల చెరువులో ఇద్దరు పిల్లలతో సహా దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఆత్మహత్యకు కారణమ్తెన భర్త రామాంజనేయుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Political War in Pinapaka: భగ్గుమన్న విభేదాలు.. పొంగులేటి, రేగా వర్గీయుల మధ్య వివాదం
మరో వైపు శ్రీ సత్య సాయి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పుట్టపర్తి మండలం బత్తలపల్లి గ్రామానికి చెందిన చరణ్ కుమార్ తో ఆరేళ్ళ క్రితం బుక్కపట్నం మండలం మారాల గ్రామానికి చెందిన భాగ్యమ్మ మధ్య ప్రేమ వివాహం జరిగింది. ఇద్దరికీ ఐదేళ్ళ కుమారుడు, మూడేళ్ళ కూతురు వున్నారు. వీరి బంధం కొన్ని సంవత్సరాలు అన్యోన్యంగా సాగింది. గత కొన్ని రోజులుగా భార్య భర్తల మధ్య విబేధాలు పొడచూపాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అనుమానించడం మొదలుపెట్టాడు. ఎన్ని సార్లు చెప్పిన భర్త మనస్సు మారలేదు. దీంతో ఇద్దరు చిన్నారులకు ఉరి వేసి ఆమె ఆత్మహత్య చేసుకుంది. తన మరణానికి సంబంధించిన కారణాలు సూసైడ్ నోట్లో పేర్కొంది. ఈ సంఘటన తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం , శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ రెండు ఘటనలలో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో ఆరు ప్రాణాలు బలి అయ్యాయి.ఇందులో అభం శుభం ఎరుగని నలుగురి ఆయుష్షు ముగిసింది.
Wife Protests at Husbands Home: భర్త కోసం భార్య అలుపెరుగని పోరాటం