Site icon NTV Telugu

Thopudurthi Prakash Reddy: టీడీపీ హయాంలో చేసుకున్నవి ఎంవోయూలు కాదు.. చీకటి ఒప్పందాలు

Thopudurthi Prakash Reddy

Thopudurthi Prakash Reddy

Thopudurthi Prakash Reddy: అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. రాని పరిశ్రమలు జిల్లాకు వచ్చాయని టీడీపీ నేతలు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అభూత కల్పనలను నిజాలుగా చూపించే క్రెడిట్ టీడీపీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. రాప్తాడుకు జాకీ పరిశ్రమ వచ్చింది భూముల కోసమేనని.. వారు ఇక్కడ భూములతో వ్యాపారాలు చేయాలని చూశారని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. జాకీ పరిశ్రమ టీడీపీ హయాంలో వచ్చినట్లు.. వైసీపీ హయాంలో వెనక్కి వెళ్లిపోయినట్లు ప్రచారం చేస్తున్నారని.. లీజు ప్రాతిపదికన ఏ కంపెనీ వచ్చినా పరిశ్రమలు పెట్టేందుకు తాము సహకరిస్తామని స్పష్టం చేశారు.

Read Also: ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉంది వీళ్లకే

రైతుల భూములతో వ్యాపారాలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పరిటాల సునీత సివిల్ సప్లై మినిస్టర్‌గా ఉన్నప్పుడు జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. రైతులను మభ్య పెట్టేందుకు ఇప్పుడు పాదయాత్రలు చేస్తున్నారని.. అమరావతి నిర్మాణం చేయకుండా చంద్రబాబు తన చాతుర్యంతో ప్రజలని భ్రమలో పెట్టారని చురకలు అంటించారు. నారా లోకేష్ ఒక నామినేటెడ్ రాజకీయ నాయకుడు అని.. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో పరిశ్రమలు తెచ్చామన్న భ్రమలు కల్పించారని.. అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు పరిశ్రమలు వెళ్లిపోతున్నాయంటూ జిల్లా టీడీపీ నేతలు గ్లోబెల్ ప్రచారం చేస్తున్నారని.. టీడీపీ హయాంలో చేసుకున్నవి ఎంవోయూలు కాదని.. అవి చీకటి ఒప్పందాలు అని ఆరోపించారు.

Exit mobile version