దొంగలు రెచ్చిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పురాతన మాండవ్య నారాయణ స్వామి ఆలయంలో గత రాత్రి చోరీ ఘటన చోటుచేసుకుంది. రాత్రి సమయంలో గోడ దూకి లోనికి ప్రవేశించిన దుండగులు ఆలయంలోని పలు హుండీలను పగలు కొట్టి నగదుతో పాటు సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ ను సైతం దొంగిలించారు. శనివారం ఉదయం యధావిధిగా ఆలయం తలుపులు తెరిచిన పూజరి చిందరవందరగా కింద పడివున్న వస్తువులను చూసి దొంగతనం జరిగిందని గ్రహించి ఆలయ ఈవో కి సమాచారాన్ని అందించారు.
ఈవో ఫిర్యాదు మేరకు ఆలయం వద్దకు చేరుకున్న సామర్లకోట పోలీసులు పరిసరాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం అనవాళ్ళను సేకరిస్తున్నారు.పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు.