ఏపీలో ప్రస్తుతం ఎయిడెడ్ విద్యాసంస్థల ఇష్యూ నడుస్తోంది. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వం లాక్కొని విద్యార్థులపై భారం వేస్తోందంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఏపీ ఎయిడెడ్ విద్యా సంస్థల యాజమాన్య అసోసియేషన్ అధ్యక్షుడు ముత్తాబత్తుల రత్నాకుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిడెడ్ విద్యా సంస్థలను అప్పగించాలని ప్రభుత్వం మా పై ఎటువంటి బలవంతం చేయటం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను నడపలేకపోతేనే ప్రభుత్వానికి అప్పగించమని అడిగారని, నడుపుకోగలుగుతున్న వారి పై ఎటువంటి ఒత్తిడి లేదని తెలిపారు.
ఎయిడెడ్ విద్యా సంస్థల ఆస్తులను ప్రభుత్వం లాక్కుంటుందన్న తప్పుడు ప్రచారాన్ని టీడీపీ వాళ్లు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులు, చంద్రబాబు రాష్ట్రంలో అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని, విద్యార్ధుల తల్లిదండ్రులు దీన్ని గమనించాలన్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ తమను ప్రభుత్వంలో కలపమని అభ్యరిస్తున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా ఎయిడెడ్ విద్యా సంస్థల ప్రతినిధి ప్రసాద్ మాట్లాడుతూ.. ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలను మేము స్వాగతిస్తున్నామన్నారు.
ఎయిడెడ్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసింది చంద్రబాబు అని విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి గంటా శ్రీనివాసరావు దగ్గరకు వెళ్లి మేము ఎన్నో సార్లు కలిసి ఆదుకోమని విజ్ఞప్తులు చేశామని, అయినా మమ్మల్ని పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు ఎయిడెడ్ విద్యా సంస్థల పై ముసలి కన్నీళ్లు కారుస్తున్నారని, పవన్ కళ్యాణ్ కు అప్పుడు మా సమస్యలు కనిపించలేదా..?అని ప్రశ్నించారు.