NTV Telugu Site icon

Godavari Floods: వరద కష్టాలు.. పడవలో వరుడి ఇంటికి పెళ్లికూతురు..

Bride

Bride

ఓవైపు వరదలు ముంచెత్తుతున్నాయి.. మరోవైపు పెళ్లి ముహూర్తం ముంచుకొస్తుంది.. రోడ్డు మార్గంలో వెళ్లే పరిస్థితి లేదు.. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటేనే.. గోదావరి వదర భయపెడుతోంది.. ఆ సమయంలో.. పెళ్లి కూతురుకు, ఆమె బంధువులకు పడవే ఆధారంగా మారింది.. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నంలంకలో పెళ్లి కూతురిని పడవలో తీసుకెళ్లారు బంధువులు.. సాధారణంగా ఆగస్టు నెలలో వర్షాలు, వరదలు ఎక్కువగా ఉంటాయని భావించిన రెండు కుటుంబాలు.. ముందుగానే అంటే జులై నెలలో ముహూర్తం పెట్టుకున్నారు.. అయినా, వారికి వరద కష్టాలు తప్పలేదు.. ఈ రోజు ఉదయం జరిగిన అశోక్ – ప్రశాంతి పెళ్లి జరిగింది.. భారీ వరదలు, ముంపుల కారణంగా.. పెదపట్నంలంక నుంచి పెళ్లికూతురు ప్రశాంతిని.. పడవపై కేశనపళ్లిలోని వరుడు అశోక్‌ ఇంటికి తీసుకెళ్లారు పెళ్లికూతురు బంధువులు.. ఆ తర్వాత వివాహ తంతు ముగించారు..

Read Also: Komati Reddy Venkat Reddy: టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే.. ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయ్యేది

మొత్తంగా.. కల్యాణం వచ్చినా, కక్కొచ్చొనా ఆగదని చెబుతుంటారు పెద్దలు.. పెద్ద వరద వచ్చినా.. వీరి పెళ్లి ఆపలేకపోయిందంటూ.. ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.. కాగా, గోదావరిలో క్రమంగా వరద పెరుగుతూనే ఉంది.. భద్రాచలం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు.. కొత్తగూడెం నుంచి మినహా భద్రాచలానికి వచ్చే మార్గాలన్నింటిని గోదారమ్మ ముంచేస్తోంది.. మరోవైపు.. ధవళేశ్వరం దగ్గర క్రమంగా వరద పెరుగుతోంది.. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా.. మూడో ప్రమాద హెచ్చరికను సైతం దాటి గోదావరి ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.