తెలుగుమ్మాయి బండ్ల శిరీష.. అంతరిక్ష పర్యటనకు వెళ్లనుంది. స్పేస్ టూరిజాన్ని ప్రోత్స హించడంలో భాగంగా వర్జిన్ గెలాక్టిక్ సంస్థ నిర్వహిస్తున్న ఈ స్పేస్ ఫ్లైట్‌లో.. శిరీష ప్రయాణిం చనున్నారు. భారత్ మూలలుండి అంతరిక్షంలోకి వెళ్తున్న నాలుగో వ్యక్తి బండ్ల శిరీష. అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ స్పేస్ ఫ్లైట్ ను పంపిస్తోంది. ఇందులో సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్, సంస్థ లీడ్ ఆపరేషన్స్ ఇంజనీర్ కాలిన్ బెన్నెట్, కంపెనీ చీఫ్ ఆస్ట్రోనాట్ సలహాదారు బెత్ మోసెస్, భారత సంతతికి చెందిన బండ్ల శిరీష వెళ్తున్నారు. బృందంలో ఇద్దరు పైలట్లు కూడా ఉంటారు.
read also : స్థిరంగా బంగారం ధరలు..పెరిగిన వెండి ధరలు
తెలుగు మూలాలున్న ఓ మహిళ అంతరిక్ష యాత్ర చేయడం ఇదే తొలిసారి. గతంలో భారత్‌కు చెందిన కల్పనా చావ్లా, భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లారు. వర్జిన్ గెలాక్టిక్ సంస్థ మానవ సహిత అంతరిక్ష యాత్ర నిర్వహించడం కూడా ఇదే తొలిసారి. గతంలో మూడు సార్లు మనుషుల్లేకుండా ప్రయోగాలు నిర్వహించింది. అంతరిక్షంలోకి ప్రయాణికులను తీసుకె ళ్లేందుకు ఈ కంపెనీకి జూన్ 25న ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ లైసెన్సు జారీచేసింది.
బండ్ల శిరీష ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జన్మించారు. హ్యూస్టన్, టెక్సాస్‌లో పెరిగారు. అంతరిక్షంపై ఆసక్తితో పర్‌డ్యూ వర్సిటీ నుంచి ఏరోనాటికల్-ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేశారు. వాషింగ్టన్ వర్సిటీ నుంచి ఎంబీఏ చేశారు. ప్రస్తుతం ఆమె వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ప్రభుత్వ వ్యవహారాల విభాగం ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.
అంతరిక్ష పర్యాటకంపై ప్రపంచస్థాయి దిగ్గజ సంస్థల ప్రతినిధులు ఆసక్తి కనబరుస్తున్నారు. స్పేస్ ఎక్స్ సంస్థ అధిపతి ఎలాన్ మస్క్ అంతరిక్షానికి షటిల్ సర్వీసులు నడుపుతామని ప్రకటించడం, తర్వాత అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఇదే తరహా ప్రయోగాలు చేయడంతో స్పేస్ యాత్రలపై పోటీ పెరిగింది. ఈ నెల 20న అంతరిక్షంలోకి వెళ్లనున్నట్టు బెజోస్ ప్రకటించారు. ఆయనకు పోటీగా, ఆయన కంటే ముందుగా అంతరిక్ష యాత్ర చేయాలన్న ఉద్దేశంతో వర్జిన్ గెలాక్టిక్ ఈ యాత్ర నిర్వహిస్తోంది.