జాతీయ స్థాయిలో చక్రం తిప్పిందేకు టీఆర్ఎస్ పార్టీ పేరును కాస్తా బీఆర్‌ఎస్‌గా మార్చేశారు.. పొరుగు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌పై కూడా బీఆర్ఎస్ నేతలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.. ఏపీలో ముఖ్య నేతలపై బీఆర్ఎస్ కన్నేసిందా..? అలాంటి వారిని గుర్తించి బీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోందా..? అంటే విశాఖలో జరిగిన ఓ పరిణామం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. సీబీఐ మాజీ అధికారి లక్ష్మీ నారాయణతో సమావేశం అవ్వడానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. ఆయనను.. బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించేందుకే ఈ సమావేశం అని ఓ టాక్ నడుస్తోంది. ఇదే విషయాన్ని తలసాని.. లక్ష్మీనారాయణతో చెప్పినట్టు తెలుస్తుండగా.. అయితే.. రాజకీయంగా నిర్ణయం తీసుకోవడానికి సమయం ఉందని లక్ష్మీనారాయణ అన్నారని సమాచారం. మరోవైపు.. ఆమ్‌ఆద్మీ పార్టీతో ఇప్పటికే.. జేడీ లక్ష్మీనారాయాణ టచ్‌లో ఉన్నట్టు కూడా ప్రచారం సాగుతోంది..
Read Also: President Draupadi Murmu: శ్రీశైలం పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
మరోవైపు.. 2024 ఎన్నికల్లోనూ విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని ఈ మధ్యే సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. విశాఖపట్నం ప్రజలు తనకు ఎంతో ప్రేమ, ఆప్యాయత, గౌరవం ఇచ్చారని.. అందుకే మళ్లీ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు.. ప్రస్తుతానికి తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలనుకుంటున్నట్లు చెప్పారు. అప్పటి వరకు తన భావజాలానికి అనుకూలంగా ఉండే రాజకీయ పార్టీకి మద్దతుగా ఇస్తానని.. త్వరలో తన మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు కూడా చెప్పారు.. అయితే, గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున విశాఖ లోక్‌సభ నుంచి బరిలోకి దిగారు లక్ష్మీనారాయణ.. కానీ, ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.. కొన్నిరోజుల పాటు జనసేనలో కొనసాగినా.. ఆ తర్వాత రాజీనామా చేసి దూరంగా ఉంటున్నారు.. గతంలో సీబీఐ జేడీగా పని చేసి.. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చికున్న లక్ష్మీనారాయణ… వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన విషయం విదితమే.. మరి, ఆయన.. అడుగులు బీఆర్‌ఎస్ వైపు పడతాయా? లేక ఆప్ వైపు నడుస్తారా? లేదా స్వతంత్రంగానే బరిలోకి దిగుతారా? ఇంకా ఏదైనా పార్టీలో చేరతారా? అనేది మాత్రం వేచిచూడాల్సిన విషయమే. అయితే, టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా మారిన తర్వాత ఏపీలో కూడా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు వెలిసిన విషయం విదితమే.