Hindupuram: హిందూపురం నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నడుం బిగించారు. ఈ మేరకు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం చలివెందులలో ఆయన ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ.. నేను హిందూపురం వాడినే అని… మనలో మనకి అమరికలు ఉండకూడదని వ్యాఖ్యానించారు. చలివెందులలో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం శుభపరిణామం అని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా సేవలు అందించే బృహత్తర కార్యక్రమాన్ని తాము చేపట్టామని తెలిపారు. ఇందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని బాలయ్య పిలుపునిచ్చారు.
Read Also: South Central Railway: రేపటి నుంచి పట్టాలెక్కనున్న గుంటూరు-తిరుపతి ఎక్స్‌ప్రెస్
తొలిసారిగా మొబైల్ వాహనంలో ఈసీజీ, ఆక్సీమీటర్, అత్యాధునికమైన మైక్రోస్కోప్ వంటి పరికరాలు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే బాలకృష్ణ వివరించారు. ఈ వాహనం ద్వారా ప్రజలకు సుమారు 200 పరీక్షలు చేసే వెసులుబాటు ఉందన్నారు. అటు 107 రకాల మందులు ఉచితంగా సరఫరా చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజల జబ్బులు నయం అయ్యేవరకు ఈ వైద్య సేవలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బసవతారకం క్యాన్సర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
గతంలో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిని ఎంతో అభివృద్ధి చేశామని.. ప్రస్తుతం ఆసుపత్రిలో 20 ఇంక్యూబేటర్లు నిరుపయోగంగా ఉన్నాయని బాలయ్య గుర్తుచేశారు. ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలని.. మనుషులను మనుషులుగా గుర్తించాలని.. అది సంస్కారం అని హితవు పలికారు. అందుకే టీడీపీ పుట్టిందన్నారు. ఎన్టీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ సహకారంతో భవిష్యత్‌లో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని బాలయ్య వెల్లడించారు. అందరూ ఎన్టీఆర్ వైద్యరథాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వాహనానికి ఎవరైనా అపకారం చేసే ప్రమాదం ఉందని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని బాలయ్య తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్టు సహకారంతో హిందూపురంను ఆరోగ్యపురంగా చేస్తామన్నారు. చంద్రబాబు సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరిస్తామని పేర్కొన్నారు.
