NTV Telugu Site icon

Vangalapudi Anitha: మంత్రి మేరుగ నాగార్జున దళితుడు కాదా?

Vangalapudi Anitha

Vangalapudi Anitha

ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ నేతల మధ్య మాటల వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి మేరుగ నాగార్జునపై టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి మేరుగ నాగార్జున పేరు చివ‌ర రెడ్డి అనే ప‌దం క‌నిపించడంపై ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంత్రి మేరుగ నాగార్జున తాను ద‌ళిత బిడ్డ అన్న విష‌యాన్ని మ‌రిచిపోయిన‌ట్లు ఉన్నార‌ని వంగలపూడి అనిత సెటైర్ వేశారు. ద‌ళితుల మీదే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతుంటే ఆయన ఎందుకు మాట్లాడరంటూ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో ద‌ళితుల‌పై అత్యాచారాలు, హ‌త్యలు జ‌రుగుతున్నా మౌనంగా ఉండటంపై ఆమె మండిప‌డ్డారు. మంత్రి పదవి, బుగ్గ కారు వచ్చాక పూర్తిగా పాలెగాళ్ళలో కలిసిపోయారని.. అందుకే వైసీపీ నేతలు ఆయనకు ‘రెడ్డి’ అనే తోక తగిలించారంటూ వంగలపూడి అనిత ఆరోపించారు.

కాగా వాస్తవానికి మేరుగ నాగార్జున ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత. ఆయ‌న పేరు నాగార్జున మాత్రమే. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికల్లో విజయం సాధించారు. వేమూరు నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు చేశారు. అయితే శ‌నివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఓ పార్కు అభివృద్ధి ప‌నుల ప్రారంభం సంద‌ర్భంగా అధికారులు ఏర్పాటు చేసిన శిలాఫ‌ల‌కంపై మేరుగ నాగార్జున పేరును మేరుగ నాగార్జున‌రెడ్డి అని రాయించారు. ఈ విషయాన్ని ఉద్దేశించి తాజాగా వంగలపూడి అనిత విమర్శల వర్షం కురిపించారు. ఆయన దళిత నేతో లేదా రెడ్డి నేతో స్పష్టం చేయాలన్నారు.