Site icon NTV Telugu

Nara Lokesh: ఏపీలో ఉన్నది పోలీసులా? రౌడీషీటర్లకు అనుచరులా?

ఏపీలో పోలీసులపై మాజీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో ఉన్నది పోలీసులా లేదా వైసీపీ రౌడీషీటర్లకు అనుచరులా అనే అనుమానాలు నెలకొన్నాయని లోకేష్ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడమే నేరంగా శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి గ్రామ టీడీపీ కార్యకర్త కోన వెంకటరావును వేధించి ఆత్మహత్య చేసుకోవడానికి పోలీసులు కారణమయ్యారని లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు.

ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ అవినీతి, అక్రమాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని ఇలా చంపుకుంటూ పోతే రాష్ట్రంలో వైసీపీ నేతలు, పోలీసులు మాత్రమే మిగులుతారని లోకేష్ అభిప్రాయపడ్డారు. టీడీపీ కార్యకర్త కోన వెంకటరావు మృతికి కారణమైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, బాధ్యులైన పోలీసులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వెంకటరావు కుటుంబానికి టీడీపీ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. సోషల్ మీడియా పోస్టుల పేరుతో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు ఇప్పటికైనా వేధింపులు ఆపాలని హితవు పలికారు. తాము చట్టాలను గౌరవిస్తున్నామని.. పోలీసులను అడ్డుపెట్టుకుని అరాచకాలకు తెగబడితే తిరుగుబాటు తప్పదని ఏపీ ప్రభుత్వాన్ని లోకేష్ హెచ్చరించారు.

Exit mobile version