పల్నాడు జిల్లా మాచర్లలో తాజాగా జరిగిన హింసాత్మక ఘటనలు కలకలం సృష్టించాయి.. ఇక, ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు.. టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇంఛార్జీ బ్రహ్మారెడ్డి సహా తొమ్మిదిపై సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.. ఇందులో ఏ-1గా బ్రహ్మారెడ్డిని పేర్కొన్నారు. అయితే, మాచర్లలో పరిస్థితులు, కేసులపై ఓ వీడియో విడుదల చేశారు మాచర్ల టీడీపీ ఇంచార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి.. టీడీపీ నేత చంద్రయ్య హత్య కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వ్యాఖ్యలు హాస్యాస్పదమన్న ఆయన.. చంద్రయ్యను వైసీపీ ఎంపీపీ నడిబజార్‌లో పీక కోసిన మాట వాస్తవం కాదా..? పిన్నెల్లికి నిజాలు చెప్పటం రాదు.. అబద్దాలే పిన్నెల్లి జీవితం అంటూ మండిపడ్డారు. మా పార్టీ కార్యక్రమాన్ని అడ్డుకుని దాడులు జరిపారు.. మేం ప్రతిఘటిస్తే వైసీపీ నేతలు పారిపోయారు.. నన్ను బయటకి పంపించి మళ్లీ దాడులు చేశారని విమర్శించారు.. వైసీపీ అరాచకాలకు స్వస్తి పలకాలని ప్రజలు నిర్ణయించుకున్నారు.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో ఎంత మందిని కేసులతో వేధించారో అందరికీ తెలుసన్నారు.
మాచర్లలో టీడీపీ కార్యకర్తలు చూపించిన చొరవ, పౌరుషం కొనసాగించాలని పిలుపునిచ్చారు బ్రహ్మారెడ్డి.. నన్ను కాపాడటానికి పార్టీ కార్యకర్తలు చూపిన తాపత్రయం నేను మర్చిపోలేనన్న ఆయన.. టీడీపీ కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన పని లేదు. టీడీపీ రాష్ట్ర నాయకత్వం మనకు అండగా ఉంటుందన్నారు.. ఇక, పల్నాడులో పుట్టినవాళ్లు పోలీస్ స్టేషన్ గడప తొక్కకుండా ఎవరూ లేరు.. పోలీసు కేసులకు భయపడాల్సిన పనిలేదన్నారు.. కార్యకర్తల తరపున న్యాయ పోరాటం చేయటానికి పార్టీ సిద్ధంగా ఉంది. ప్రత్యేక పరిస్థితుల వల్ల నేను మీకు నేరుగా అందుబాటులో రాలేకపోతున్నాను.. ఈ పరిస్థితి బాధాకరం. మీకు ఏమైనా ఇబ్బంది జరిగితే రాష్ట్ర పార్టీకి తెలియజేయండి అని సూచించారు టీడీపీ మాచర్ల ఇంఛార్జ్ బ్రహ్మారెడ్డి. కాగా, మాచర్లలో దాడికి గురైన టీడీపీ నేతలు, కార్యకర్తలతో ఫోన్‌లో మాట్లాడిన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. బాధితులను పరామర్శించారు. ప్రతి ఒక్క బాధితునితో, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పార్టీ నేతలను అక్రమ కేసుల నుంచి బయటపడెయ్యడమే కాకుండా, అసలు కారకులపై చర్యలు తీసుకునే వరకు న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించిన విషయం విదితమే.