NTV Telugu Site icon

TDP: ఏపీలో ఉన్న బీసీలు.. బీసీలు కాదా..?

Ayyanna Patrudu

Ayyanna Patrudu

ఏపీలో ఉన్న బీసీలు.. బీసీలు కాదా..? అంటూ సోషల్‌ మీడియా వేదికగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని నిలదీశారు టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు.. ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను సీఎం వైఎస్‌ జగన్‌ ఖరారు చేశారు. విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం కల్పించిన ఆయన.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, బీసీ సామాజిక వర్గానికి చెందిన బీద మస్తాన్‌రావును, సుప్రీం కోర్టు న్యాయవాది నిరంజన్‌రెడ్డికి అవకాశం కల్పిస్తూ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. అయితే, ఆర్‌. కృష్ణయ్యను నియమించడాన్ని టీడీపీ తప్పుబడుతోంది.. ముఖ్యకారణం ఆయన తెలంగాణకు చెందిన నేత కావడమే..

Read Also: Chandrababu Tour: నేడు సీఎం జిల్లాలో మాజీ సీఎం పర్యటన..

ఈ వ్యవహారంపై ట్వీట్‌ చేసిన అయ్యన్నపాత్రుడు.. ఏపీలో ఉన్న బీసీలు.. బీసీలు కాదా? అని ప్రశ్నించారు. పెద్దల సభకు వెళ్లే అర్హత ఏపీలోని ఏ ఒక్క బీసీ నేతకూ లేదా..? అని నిలదీశారు. నిధులు, విధుల‌తోపాటు కూర్చోవ‌డానికి కుర్చీ కూడా లేని ఉత్తుత్తి 56 కార్పొరేష‌న్లను బీసీల‌కు విదిల్చారని ఎద్దేవా చేసిన ఆయన.. తెలంగాణ వాళ్లకు అత్యున్నత రాజ్యస‌భ స్థానాలు కట్టబెట్టారని ఫైర్‌ అయ్యారు.. నిధులు, నీళ్లు, నియామకాలు నినాదంతో పోరాడి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు జగన్ సీఎం అయిన మొద‌టి రోజు నుంచే ఏపీ నిధులు, నీళ్లు, నియామ‌కాల‌న్నీ తెలంగాణ‌కి దోచిపెడుతున్నారని ఆరోపించారు అయ్యన్నపాత్రుడు.