ఈ నెల 7వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇప్పటికే గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే, అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా? వద్దా? అనేదానిపై మల్లగుల్లాలు పడుతూ వచ్చిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ చివరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకుంది.. మొదట పొలిట్‌బ్యూరో సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌ను వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నా… ఇవాళ జరిగిన టీడీఎల్పీ సమావేశంలో మాత్రం సభకు వెళ్లేందుకే మొగ్గు చూపారు సభ్యులు… అయితే, చంద్రబాబు మాత్రం సభకు హాజరు కావడంలేదు.. చంద్రబాబు మినహా.. అసెంబ్లీకి వెళ్లనున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. సభకు వెళ్లకూడదని పొలిట్ బ్యూరో దాదాపు నిర్ణయం తీసుకున్నా.. పొలిట్ బ్యూరో అభిప్రాయాన్ని కూడా కాదని అసెంబ్లీకి వెళ్లడానికే మొగ్గు చూపారు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. పెద్ద ఎత్తున సమస్యలు, ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్న క్రమంలో బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలని పయ్యావుల కేశవ్, యనమల రామకృష్ణుడు సూచించారు.
Read Also: Minister Appalaraju: అది అమరావతి కాదు.. ‘కమ్మ’రావతి..
రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ప్రజా సమస్యల పై చర్చ కోసం సభకు వెళ్తామంటున్నారు టీడీపీ సభ్యులు.. ప్రజా సమస్యలపై చర్చకు పలు డిమాండ్లను బీఏసీలో ప్రస్తావించనున్నారు.. బీఏసీలో ప్రభుత్వం స్పందించే వైఖరిని బట్టి తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నట్టు టీడీపీ నేతులు చెబుతున్నారు.. అమరావతి, పోలవరం, రైతుల సమస్యలపై సభలో చర్చిస్తామని స్పష్టం చేశారు.. సభలో వైసీపీ ఏకపక్షంగా వెళ్లకుండా అడ్డుకోవాల్సి ఉందన్న అభిప్రాయాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారు.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై సభలోనే సీఎం వైఎస్ జగన్‌ను నిలదీయాలని టీడీపీ సభ్యులు అభిప్రాయడడంతో.. సభకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారు.