త్వరలోనే ఎన్నికలకు వెళ్లాలని సీఎం జగన్ భావిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. తాము కూడా ఎన్నికలు రెడీగా ఉన్నామని చెప్పారు. నెత్తిమీద కుంపటిని దించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయమన్నారు చంద్రబాబు. రేపో ఎల్లుండో సీఎం జగన్ ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారన్న చంద్రబాబు.. రోజు రోజుకూ పతనావస్థకు వెళ్తున్నారని.. మరిన్ని రోజులు గడిస్తే వ్యతిరేకత పెరుగుతుందని సీఎం భయపడుతున్నారని తెలిపారు.. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయమని జోస్యం చెప్పారు.
Read Also: Fuel Prices: అది నిజమే కావొచ్చు అంటున్న కేంద్ర మంత్రి..
ఇక, సీఎం జగన్ పక్కా బిజినెస్ మ్యాన్ అని వ్యాఖ్యానించారు చంద్రబాబు.. ప్రతి రోజూ ఎంత సంపాదించామోనని గల్లా పెట్టే చూసుకుంటూ ఉంటారని ఎద్దేవా చేసిన ఆయన.. ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణే లేదన్నారు. ఆర్భాటంగా తెచ్చిన దిశ చట్టానికి చట్టబద్ధతేలేదన్నారు. తాను కట్టిన పోలీస్ స్టేషన్లకు రంగులేని దిశ పోలీస్ స్టేషన్లంటూ హడావుడి చేశారని మండిపడ్డారు చంద్రబాబు. ఇక, మహిళల క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిగా పెట్టుకుందని ఆరోపించిన ఆయన.. అసెంబ్లీలో నా భార్యను కించపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు కానీ.. ఇప్పుడు కానీ.. భువనేశ్వరి ఎప్పుడైనా రాజకీయాల్లో కన్పించారా..? అని ప్రశ్నించారు. అమరావతిలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు చంద్రబాబు.