ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో పలు చోట్ల కార్యకర్తలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తిరుపతి నాలుగు కాళ్ల మండపం వద్ద టీడీపీ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. లాంతర్లు నెత్తిపై పెట్టుకుని విసనకర్రలతో విసురుకుంటూ బల్బులను మెడలో వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. చేతగాని సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పరిపాలన చేతకాకపోతే సీఎం పదవి నుంచి జగన్ దిగిపోవాలని వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు జనసేన కార్యకర్తలు ఏపీలోని అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసనకు దిగారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ గుంటూరు కలెక్టరేట్‌లోకి జనసేన కార్యకర్తలు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు విజయనగరం కాంప్లెక్స్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు జనసైనికులు నిరసన ర్యాలీ చేపట్టారు. అటు పలు చోట్ల బీజేపీ శ్రేణులు కూడా విద్యుత్ ఛార్జీలపై నిరసన తెలిపాయి. తిరుపతిలో ఆందోళన చేపట్టిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
