ఏపీ మంత్రులు తలపెట్టిన సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. విశాఖ పాత గాజువాక వైఎస్ఆర్ విగ్రహం నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం అమలాపురం అల్లర్లపై స్పందించారు. ఏపీలో ప్రతిపక్షాలు కావాలనే అల్లర్లు సృష్టిస్తున్నాయని స్పీకర్ తమ్మినేని ఆరోపించారు. టీడీపీ వాళ్లు చేసేది మహానాడు కాదు వల్లకాడు అని ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. చచ్చిన పార్టీకి ప్రజలు దహన సంస్కారాలు చేస్తున్నారని.. జగన్మోహన రథచక్రాల కింద విపక్షాలు నలిగిపోతున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బలహీన వర్గాలకు సీఎం జగన్ పెద్దపీట వేశారన్నారు. దేశంలో ఏ నేత ఇలా సామాజిక న్యాయం చేయలేదని తమ్మినేని సీతారం పేర్కొన్నారు.
మరోవైపు వైద్యశాఖ మంత్రి విడదల రజినీ కూడా సామాజిక న్యాయభేరీ బస్సు యాత్రలో ప్రసంగించారు. కేబినెట్‌లో 70 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అప్పగించిన ఘనత సీఎం జగన్‌దే అని ఆమె ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు వైసీపీ ప్రభుత్వం సమన్యాయం చేస్తోందని.. సామాజిక న్యాయానికి జగన్ అడుగులు వేశారని మంత్రి విడదల రజినీ అభిప్రాయపడ్డారు. ఏపీలో జగన్ సంక్షేమ రాజ్యాన్ని సృష్టించారని ఆమె పేర్కొన్నారు.