Tamilnadu CM Stalin Letter To AP CM Jagan About Reservoirs: ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో ఆనకట్టల నిర్మాణాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. ముక్కల కలందిగయ్, కథరాపల్లి గ్రామాల్లో చేపట్టిన రిజర్వాయర్ల నిర్మాణంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొసస్తల నదిపై ఆనకట్టల నిర్మాణాన్ని ఖండిస్తున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇది రెండు రాష్ట్రాల మధ్య పారుతున్న నది అని పేర్కొన్నారు. తమిళనాడు ప్రభుత్వంతో చర్చించకుండా ఏపీ ప్రభుత్వం ఎలాంటి ఆనకట్టలు నిర్మించొద్దని స్టాలిన్ లేఖలో కోరారు. రెండు ఆనకట్టల నిర్మాణం జరిగితే.. చెన్నైకు తాగునీటి సమస్య ఏర్పడుతుందన్నారు. ఆనకట్టల నిర్మాణం వెంటనే ఆపే విధంగా యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. నదీ పరివాహక ప్రాంతంలో భవిష్యత్తులోనూ ఆనకట్టల నిర్మాణం చేపట్టవద్దని ఆ లేఖలో సీఎం స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.
మరోవైపు.. ప్రభుత్వాలు విద్య, వైద్యం కోసం పెట్టే ఖర్చును ఉచిత పథకాలు, తాయిలాలుగా చూడటం సరికాదని ప్రధాని మోదీ సహా ఇతర బీజేపీ నేతల వ్యాఖ్యలకు స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. ‘‘ప్రజలకు జ్ఞానాన్ని ఇచ్చేది విద్య.. వారికి ఆరోగ్యాన్ని చేకూర్చేది వైద్యం, మందులు. ఈ రెండు వర్గాల కోసం తగిన సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. ఇవి ఉచితాలు ఏమాత్రం కావు.. సామాజిక సంక్షేమ కార్యక్రమాలు. ఇవి వెనుకబడిన వర్గాలకు, పేదలకు, ఆపదలో ఉన్నవారికి ప్రయోజనం కలిగిస్తాయి’’ అని స్టాలిన్ పేర్కొన్నారు. అంతేకాదు.. కొందరు వ్యక్తులు ఉచిత పథకాలు, హామీలు వద్దంటూ కొత్తగా సలహాలు ఇస్తున్నారని.. అలాంటి వాటిని తాము పట్టించుకోమంటూ స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ అంశం గురించి తాను ఎక్కువగా మాట్లాడితే.. అది రాజకీయం అవుతుందని, అందుకే ఎక్కువగా మాట్లాడదలచుకోలేదని పేర్కొన్నారు.