రాష్ట్రంలో ఆమోదం పొందిన ప్రాజెక్టుల గ్రౌండింగ్ ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా జరగాలని, డిసెంబర్ 2028 కల్లా ప్రారంభమయ్యేలా చూడాలని మంత్రుల కమిటీ, అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్రం అనుసరిస్తున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాన్ని ఆచరణలో చూపాలన్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలు, ఎస్ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టులపై మంత్రుల కమిటీతో క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంఓయూల స్థితిగతులు, ప్రాజెక్టుల పురోగతిపై ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రుల కమిటీ తీసుకున్న చర్యలు, ప్రస్తుత కార్యాచరణ, భవిష్యత్ ప్రాజెక్టుల గురించి వివరించారు. ఈ 23 నెలల్లో రూ.21,64,258 కోట్ల విలువైన మొత్తం 756 ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయని, వీటితో 21,20,567 ఉద్యోగాలు వస్తున్నట్టు తెలిపారు. ప్రైవేటు రంగంలో ఏవియేషన్ ప్రాజెక్టులను ఆకర్షించేలా చర్యలు చేపడతామని లోకేష్ చెప్పారు. పెట్టుబడుల సాధనలో దేశంలోనూ, ప్రైవేటు రంగంలోనూ ఏపీ పేరు మార్మోగుతోందని, ఎంఎస్ఎంఈల అనుమతులు, ఇతర వివరాలను త్వరలోనే వెబ్ సైట్ ద్వారా అందిస్తామని లోకేష్ తెలిపారు.
21 ప్రధాన ఆలయాలతో టెంపుల్ టూరిజం సర్క్యూట్
ప్రాజెక్టుల గ్రౌండింగ్, అనుమతుల వివరాలు, ఉద్యోగాల కల్పనపై సింగిల్ పోర్టల్‌లో డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భూ కేటాయింపుల్లో మొదటగా పర్యాటక ప్రాజెక్టులకు, తర్వాత ఐటీ కంపెనీలకు ప్రాధాన్యత కల్పించాలని సీఎం స్పష్టం చేశారు. టూరిజం, ఐటీ లాంటి ప్రాజెక్టులకు వినూత్నంగా మల్టీ పర్పస్ భవనాల నిర్మాణం చేపట్టే ఆలోచన చేయాలని సూచించారు. సూర్యలంక బీచ్ ఫ్రంట్ ను గోవా ప్లస్‌గా తీర్చిదిద్దేలా ప్రణాళికలు చేయాలని బాపట్ల బీచ్‌కు త్వరలో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఏపీలోని 21 ప్రధాన ఆలయాలను కలుపుతూ టెంపుల్ టూరిజం ప్రాజెక్టు వేగంగా చేపట్టాలన్నారు. ఐటీ ప్రాజెక్టులు తమ కార్యకలాపాలు 18 నెలల్లో ప్రారంభించేలా చూడాలని స్పష్టం చేశారు. సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ కాంపొనెంట్స్ తయారీ ప్రాజెక్టులను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి సూచించారు.
నౌకా నిర్మాణ రంగంలో విస్తృత అవకాశాలు
ట్రాన్స్‌మిషన్‌తో పాటు సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఏపీ నిర్దేశించుకున్న 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యాన్ని వేగంగా చేరుకోవాలని సీఎం అన్నారు. అయితే ఇప్పటికే 99 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ విద్యుత్ ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు. సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించేలా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు త్వరితగతిన ఏర్పాటయ్యేలా చూడాలని సీఎం అన్నారు. 2027 డిసెంబరు నాటికి 46 ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులు ఉత్తత్తి ప్రారంభించేలా నిరంతరం పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు చేయాలని సీఎం సూచించారు. షిప్ బిల్డింగ్ సెంటర్ నిర్మాణం, పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని చెప్పారు. నౌకా నిర్మాణ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని స్పష్టం చేశారు. వైద్యారోగ్య రంగ ప్రాజెక్టులు రాష్ట్రంలో ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. గడచిన 30 ఏళ్లుగా ఏపీలో భూసేకరణ గురించి వివాదాలు ఏర్పడలేదని…రైతులకు, పరిశ్రమలకు, ప్రభుత్వానికి ప్రయోజనం కలిగేలా భూ సేకరణ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.
పర్యావరణ హితంగా ప్రాజెక్టులు
‘రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల్లో పర్యావరణ హిత టెక్నాలజీ వినియోగించాలని సీఎం సూచించారు. తీరప్రాంతాల్లో సముద్రంలోకి కాలుష్య కారకాలను విడిచిపెట్టకుండా చూడాలని అన్నారు. సూర్యలంక, నెల్లూరు మైపాడు వంటి బీచ్ ప్రాంతాల్లో పరిశుభ్రమైన పరిస్థితులు ఉండాలన్నారు. కాలుష్యాన్ని సముద్రంలోకి విడిచిపెడితే భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పరిశ్రమలకు ఎస్క్రో ఖాతా ఏర్పాటు చేసే విషయంలోనూ త్వరితగతిన కార్యాచరణ చేపట్టాలన్నారు. ఎంస్ఎంఈ రైట్ టూ బిజినెస్ యాక్ట్ వెంటనే అమల్లోకి తీసుకురావాలని…నమోదు చేసుకుని పరిశ్రమ ప్రారంభించుకునేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. పరిశ్రమలు, ఎంస్ఎంఈల్లో తయారయ్యే ఉత్పత్తులు నాణ్యతపై దృష్టి పెట్టాలని.. ప్రోడెక్టు పర్ఫెక్షన్ పై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలన్నారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా ప్రాజెక్టులను సాకారం చేసేలా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని సీఎం అన్నారు.
ఎస్ఐపీబీ ఆమోదం పొందిన ప్రాజెక్టుల్లో 114 గ్రౌండింగ్
రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.11.47 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి మొత్తం 282 ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 4.32 లక్షల కోట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరం – రూ. 4.72 లక్షల కోట్లు, 2026-27లో (ఈనెల వరకు) – రూ. 2.39 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. వీటిలో ఇప్పటికే 114 గ్రౌండింగ్ అయ్యాయి. 2026 సెప్టెంబర్ నాటికి అన్ని ప్రాజెక్టుల గ్రౌండింగ్ లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇందుకోసం పర్యావరణం సహా ఇతర అనుమతులు, విద్యుత్, నీరు, రహదారులు వంటి మౌలిక వసతులు, భూముల రిజిస్ట్రేషన్, స్థానిక సమస్యల పరిష్కారం వంటి వాటిపై దృష్టి పెట్టాలన్నారు. బీపీసీఎల్, ఇండోసోల్, శ్రీ సిటీ ఫేజ్-II వంటి ప్రాజెక్టులకు భూసేకరణ అత్యంత వేగంగా కొనసాగుతోందని, బీపీసీఎల్ ప్రాజెక్టుకు అవసరమైన సుమారు 3,000 ఎకరాల్లో 2,000 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ కేవలం మూడు రోజుల్లో పూర్తి చేసినట్టు అధికారులు వివరించారు.
అంశాల పరిష్కారానికి మంత్రుల కమిటీ కృషి
పరిశ్రమల గ్రౌండింగ్ వేగవంతం కోసం మంత్రుల కమిటీ కృషి చేస్తుండగా, విదేశాల నుంచి రాష్ట్రంలో ఏర్పాటు చేసే పెట్టుబడుల వివరాలను ఈడీబీ సేకరిస్తోంది. అన్ని శాఖల పెండింగ్ అంశాలను పరిష్కరించేందుకు ఐటీ పోర్టల్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని మంత్రుల కమిటీ ఎప్పటికప్పుడు పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రాజెక్టుల వేగవంతమైన గ్రౌండింగ్ కోసం ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న పరిశ్రమలు నిర్దేశిత గడువులోగా కార్యకలాపాలు చేపట్టేలా చూడాలని మంత్రుల కమిటీకి సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, బీసీ జనార్ధన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
