Site icon NTV Telugu

Supreme Court: జీవో నంబర్‌ 1.. సుప్రీంకోర్టు విచారణపై ఉత్కంఠ

Supreme Court

Supreme Court

Supreme Court: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌ 1 పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది.. బహిరంగ ర్యాలీలు, రోడ్‌షోలకు నియంత్రణ ఉం­డేలా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌ 1పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.. వివాదాస్పద జీవో నెంబర్ 1పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ జీవోపై స్టే విధిస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు డీజీపీ కూడా ఈ కేసులో పిటిషనర్లుగా ఉన్నారు. రోడ్లు, రహదారులపై సభలు, సమావేశాలను నిషేధిస్తూ.. ఏపీ సర్కార్‌ జారీ చేసిన జీవో నెంబర్ 1ను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం విదితమే..

Read Also: High Tension In Gollapudi: గొల్లపూడిలో ఉద్రిక్తత.. వివాదాస్పద స్థలం నుంచి టీడీపీ ఆఫీస్‌ తరలింపు..!

ఈ జీవోపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.. భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా ఈ జీవో ఉందని ఆరోపించారు. రామకృష్ణ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, జీవోను జనవరి 23వ తేదీ వరకు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది… ఇక, తదుపరి విచారణ జనవరి 20కి తేదీకి వాయిదా వేసింది. కానీ, జీవో విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం ఈ జీవో జారీచేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో కొందరు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతోపాటు పంచాయితీ రాజ్ రోడ్లు, మున్సిపల్ రోడ్లపై సభలు, సమావేశాలను నిషేధిస్తూ ఈ జీవోను విడుదల చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తోంది.. ప్రజలకు ఇబ్బందులు కల్గించకూడదన్న ఉద్దేశంతో.. ప్రజల ప్రాణాలు కాపాడడానికే జీవో జారీ చేశామని, ప్రజలకు అసౌకర్యం కల్గని ప్రాంతాల్లో సభలు నిర్వహించుకోవాలని స్పష్టం చేస్తున్నారు.. కానీ, నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జీవోలో పేర్కొంది. అయితే, ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో.. అత్యున్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది.

Exit mobile version