ఏపీ సెక్రటేరియట్ ఐఏఎస్‌ల మధ్య ఆధిపత్య పోరుకు వేదిక కాబోతోందా?పాలన సజావుగా సాగుతుందా?లేక పాత పద్ధతిలోనే వెళ్తుందా?అధికారుల మధ్య సమన్వయం కొరవడితే పరిస్థితి ఏంటి?ప్రజలకు మెరుగైన పాలన అందించాలనుకునే సర్కార్ లక్ష్యం నెరవేరుతుందా?లేదా?ఇంతకీ…ఈ చర్చకు కారణం ఏంటి?
సీఎంఓలోకి పూనం మాలకొండయ్య
ఏపీ సెక్రటేరియట్లో ఐఏఎస్ అధికారుల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. సీఎస్‌గా జవహర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. దీనిపై సెక్రటేరీయేట్లో ఎలాంటి చర్చా లేదు. ఐతే…ఎవ్వరూ ఊహించని విధంగా సీఎంఓలోకి పూనం మాలకొండయ్య వెళ్లడమే ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. పూనం మాలకొండయ్య జవహర్ రెడ్డికి రెండేళ్లు సీనియర్. ఆమె సీనియరే అయినా..ఆమె పేరు సీఎస్ రేసులో పెద్దగా వినిపించలేదు. అలాగని సీఎంఓలోకి వెళ్తారనే ప్రచారమూ జరగలేదు. ఈ క్రమంలో ఆమె పేరు సీఎంఓలోకి ఖరారు కావడం ఐఏఎస్ సర్కిల్స్‌లో చర్చకు దారితీసింది.
మెడ్ టెక్ జోన్ సీఈఓగా ఉన్న జితేంద్ర శర్మ
ఐతే…గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు పూనం మాలకొండయ్య మీద విమర్శలు చేశారు. వైద్యారోగ్య శాఖలో మెడ్ టెక్ జోన్ విషయంలో జరిగిన భారీ స్కామ్ గురించి విమర్శలు గుప్పించారు. దీనికి కొనసాగింపుగానే..జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొత్తలో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. అందులో భాగంగానే జవహర్ రెడ్డి వైద్యారోగ్య శాఖకు వచ్చారు. మెడ్ టెక్ జోన్ విషయానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు జవహర్ రెడ్డి. నాటి మెడ్ టెక్ జోన్ సీఈఓగా ఉన్న జితేంద్ర శర్మకు దాదాపు అధికారాలు కట్ చేస్తూ జీవోలు జారీ చేశారు జవహర్ రెడ్డి. ఆ జీవో జారీ చేసిన తర్వాత పూనం మాలకొండయ్య, జవహర్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ చాలా కాలం నడిచింది. ఒకరి మీద ఒకరు సీఎంకు ఫిర్యాదులు చేసుకోవడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నట్టు అప్పట్లోనే జోరుగా ప్రచారం జరిగింది.
పూనం, జవహర్ రెడ్డి మధ్య సఖ్యత లేదనే భావన
ఇక…నాటి నుంచి నేటి వరకు పూనం, జవహర్ రెడ్డి మధ్య సఖ్యత లేదనే భావన చాలా మందిలో ఉంది. ఈ క్రమంలోనే సీఎంఓలో స్పెషల్ సీఎస్ హోదాలో.. అంటే దాదాపు సీఎంఓను లీడ్ చేసే బాధ్యతల్లో పూనం మాలకొండయ్య ఉంటే.. అడ్మిన్ బాస్‌గా జవహర్ రెడ్డి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ రెండు వ్యవస్థల మధ్య చక్కటి వాతావరణం ఉంటే పరిపాలనా సజావుగా సాగిపోతుందంటారు. కానీ గతం తాలుకా ప్రభావం ఇప్పటికీ వీరి మధ్య ఉంటే..పరిపాలనా పరంగా గందరగోళం నెలకొనే పరిస్థితి ఉంటుందంటున్నారు. గతంలో సీఎంఓ ముఖ్యకార్యదర్శి, జీఏడీ సెక్రటరీ హోదాలో ఉన్న ప్రవీణ్ ప్రకాష్‌కు..నాటి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం మధ్య ఇదే తరహాలో గందరగోళం ఏర్పడింది. అప్పట్లో పరిపాలనా విభాగం చాలా డిస్ట్రబ్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ అలాంటి సీనే రిపీట్ అయితే ఇబ్బంది వస్తుందనే చర్చ జరుగుతోంది.
జవహర్ రెడ్డి సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు
ఐతే…గతంలో ప్రవీణ్ ప్రకాష్-ఎల్వీ ఎపిసోడ్‌కు..ఇప్పటికీ చాలా తేడా ఉందనే వాదనా వినిపడుతోంది. గతంలో ఎల్వీ సుబ్రమణ్యానికి.. సీఎం జగన్‌కు మధ్య గ్యాప్ రావడం వల్ల గందరగోళం నెలకొందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడా పరిస్థితి లేదని.. జవహర్ రెడ్డి సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారని…పైగా సొంత జిల్లా కావడంతో వీసమెత్తు కమ్యూనికేషన్ గ్యాప్ అనేదే ఉండదని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎంఓకు..సెక్రటేరీయేట్‌కు మధ్య గ్యాప్ కానీ..వేరే విధమైన పొరపొచ్చాలు కానీ తలెత్తే అవకాశం ఉండదనేది మరో వాదన.ఏది ఏమైనా..సీఎంఓలోకి పూనం వెళ్లడంతో ఏపీ సెక్రటేరీయేట్లో మాత్రం ఆసక్తికర చర్చే జరుగుతోంది.