Srikanth Reddy: మూడు రాజధానుల అంశంలో టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరిని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తప్పుబట్టారు. అమరావతి రైతుల పాదయాత్రను తాను తప్పుపట్టడం లేదని.. పాదయాత్రలో మాట్లాడిన వాళ్ల మాటలు రాయలసీమ వాసిగా తనకు బాధ కలిగించాయని తెలిపారు. మూడు రాజధానులు చేస్తే రాయలసీమకు చుక్క నీరు ఇవ్వమని అంటున్నారని.. మూడు రాజధానులు అమలు చేస్తే మధ్య ఆంధ్ర ప్రదేశ్ కోసం ఉద్యమం చేస్తామంటున్నారని.. ఈ వ్యాఖ్యల వెనుక చంద్రబాబు ఉన్నారని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర విభజనకు ముఖ్య కారణం చంద్రబాబు అని.. ఇప్పుడు ప్రాంతాల మధ్య విద్వేషాలు ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించారు. అమరావతి పేరుతో ప్రజల్ని మభ్యపెట్టిన వ్యక్తి చంద్రబాబు అని.. కర్నూలులో న్యాయ రాజధాని వస్తుంది అంటే చంద్రబాబుకు ఎందుకు అంత ద్వేషమని నిలదీశారు.
చంద్రబాబు హయాంలో ఏపీకి ఎన్ని పెట్టుబడులు వచ్చాయని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఇవాళ ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లోనే దేశంలోని 45 శాతం పెట్టుబడులు వచ్చాయని కేంద్రమే చెప్పిందన్నారు. అమరావతి ప్రాంతంలో రూ.12వేల కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు అంటున్నారని.. ఇవాళ అమరావతి ప్రాంతంలో ఒక టీ కొట్టు ఆయినా వచ్చిందా అని నిలదీశారు. అదే డబ్బులు విశాఖలో పెట్టి ఉంటే ఎంతో అభివృద్ధి జరిగి ఉండేదన్నారు. విశాఖలో ఒక భవనం కట్టినా ఎందుకు తట్టుకోలేనితనం అని.. కోర్టులకు వెళ్ళి ఎందుకు అడ్డుకుంటున్నారని సూటి ప్రశ్న వేశారు. అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే అడ్డుకుంటున్నారన.. రాష్ట్రంలో చంద్రబాబు సామాజిక వర్గం మాత్రమే బాగుపడాలా అని శ్రీకాంత్‌రెడ్డి చురకలు అంటించారు.
Read Also:Andhra Pradesh: దేశంలోనే ఏపీ నంబర్‌వన్.. ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో రికార్డు స్థాయిలో పెట్టుబడులు
మరోవైపు రాజధాని అసైన్డ్ భూముల విషయంలో కుంభకోణం జరిగిందని తాము ముందు నుంచీ ఆరోపిస్తున్నామని ఎన్టీవీతో శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజధాని పేరు చెప్పి చంద్రబాబు, లోకేష్ బినామీలతో వేల కోట్ల రూపాయల కుంభకోణం చేశారన్నారు. దీనికి తగిన ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఇవాళ సీఐడీ ఐదుగురిని అరెస్ట్ చేసిందన్నారు. చంద్రబాబు, లోకేష్‌కు ధైర్యం ఉంటే విచారణకు సిద్ధం కావాలన్నారు. వార్తా ఛానెళ్ల లైవ్‌లో విచారణ చేద్దామన్నారు. తమ బండారం అంతా బయట పడుతుందనే భయంతోనే చంద్రబాబు పాదయాత్రలంటూ డ్రామాలు ఆడుతున్నారని.. రేపు అసెంబ్లీ వేదికగా కూడా వీటిపై చర్చిస్తామన్నారు. చంద్రబాబు పారిపోకుండా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని.. చంద్రబాబు హయాంలో చేసిన మరిన్ని కుట్రలు బయటపడతాయని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
