Duvvada Srinivas: నా ప్రాణాలకు ముప్పు ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన దువ్వాడ శ్రీనివాస్.. నా ప్రాణాలకు ఏమైనా జరిగితే ఆ ఇద్దరే కారణం అంటూ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.. తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ దువ్వాడ శ్రీనివాస్.. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. శనివారం శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన దువ్వాడ, ఎస్పీ మహేశ్వర్ రెడ్డిని కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన దువ్వాడ శ్రీనివాస్, జిల్లాలో జరుగుతున్న అన్యాయాలపై తాను నిర్భయంగా మాట్లాడుతున్నానని, ఉద్యమాల నుంచి వచ్చిన నాయకుడినని అన్నారు. ప్రజల సమస్యల కోసం గొంతు ఎత్తడమే తన లక్ష్యమని తెలిపారు.
Read Also: Bus Accident : సంగారెడ్డిలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. 22 మందికి గాయాలు.!
జిల్లాలో కొందరు నాయకులు గ్రూపులుగా ఏర్పడి ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇచ్చాపురం, టెక్కలి, ఆముదాలవలస నియోజకవర్గాల్లో రాజకీయ గ్రూపులు కలిసి ప్రాంతంలో అశాంతి నెలకొల్పే ప్రయత్నాలు చేస్తున్నాయని పేర్కొన్నారు దువ్వాడ.. తనపై బెదిరింపులు చేస్తున్నవారిలో సత్తారు సత్యం, తమన్నా కిరణ్, కోటబొమ్మాళి మండలం నుంచి మోహన్ ఉన్నారని దువ్వాడ తెలిపారు. గత కొద్ది రోజులుగా తనకు ఫోన్ ద్వారా, ప్రత్యక్షంగా బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రాణాలకు ముప్పు వాటిల్లితే ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదే కారణం అని.. అందుకే ముందస్తు భద్రతగా 2+2 గన్‌మెన్‌లను కేటాయించాలని ఎస్పీని కోరినట్లు వెల్లడించారు. చట్టంపై తనకు నమ్మకం ఉందని, ప్రజల కోసం చివరి వరకు పోరాడుతానని వ్యాఖ్యానించారు దువ్వాడ శ్రీనివాస్… అయితే, ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ప్రజా సమస్యలపై మాట్లాడేవారిని అణచివేయాలనే ధోరణి సరైంది కాదని, ప్రజాస్వామ్యంలో ప్రతీ ఒక్కరికీ అభిప్రాయం చెప్పే హక్కు ఉంటుందని దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు.