NTV Telugu Site icon

Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు వైసీపీ బిగ్ షాక్‌.. ఆ వివాదమే కారణం..!

Duvvada Srinivas

Duvvada Srinivas

Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు షాక్‌ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం. టెక్కలి నియోజకవర్గం ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర కళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పేరాడ తిలక్‌కు నియోజకవర్గ బాధ్యతలు అప్పజెబుతూ ఉత్తర్వులు జారీచేసింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. ఆయన సతీమణి టెక్కలి జడ్పీటీసీ దువ్వాడ వాణి మధ్య వివాదం నెలకొంది. అదికాస్తా చినికిచినికి గాలి వానలా మారింది. దివ్వెల మాధురి-దువ్వాడ శ్రీనివాస్ మధ్య సంబంధం బయటకు రావడం రచ్చకు దారితీసింది. దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారంటూ వాణి నిరసన చేపట్టింది. 15 రోజులుగా శ్రీనివాస్ ఇంటి ఆవరణలోనే కారు షెడ్‌లో పడుకుంటూ దువ్వాడ శ్రీను వైఖరిపై దుమ్మెత్తి పోసింది. దువ్వాడ వాణితో పాటు కుమార్తె హైందవి కూడా శ్రీనివాస్ ఉంటున్న ఇంట్లోకి ప్రవేశించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు.

Read Also: National Space Day: నేడే మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం..

ఇక.. ఈ వ్యవహారంలో ఇరువర్గాలపై టెక్కలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తరువాత ఐదు షరతులతో కుటుంబ పెద్దలు రాజీ ప్రయత్నాలు చేశారు. కానీ అవి కూడా సఫలం కాలేదు. దీంతో దువ్వాడ శ్రీనివాస్-వాణి వేర్వేరుగా కోర్టును ఆశ్రయించారు. మాధురి సైతం సోషల్ మీడియాలో ఇద్దరి మధ్య బంధంపై రచ్చ చేసింది. దువ్వాడ వాణి స్థానిక జడ్పీటీసీ… కాగా దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. దువ్వాడ వ్యవహారం పార్టీకి తీవ్రస్థాయిలో నష్టం కలిగిస్తోందని హైకమాండ్ భావించింది. దువ్వాడ శ్రీనివాస్‌ను ఇంఛార్జి బాధ్యతల నుంచి తప్పించింది. కొత్త ఇంచార్జ్‌గా పేరాడ తిలక్‌ను నియమించింది. దీంతో.. కుటుంబ వ్యవహారం కాస్తా దువ్వాడ శ్రీనివాస్‌ పొలిటికల్‌ కెరీర్‌పై ప్రభావాన్ని చూపినట్టు అయ్యింది.