Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. కింది స్థాయిలో అక్కడక్కడ కొన్ని విబేధాలు కనిపించినా.. ఆవి వెంటనే సమసిపోయేలా చర్యలు తీసుకున్నారు.. ఇక, రాష్ట్రస్థాయిలో అయితే.. ఎప్పుడూ తేడా కొట్టిందే లేదు.. ఈ నేపథ్యంలో.. నెల్లూరు పర్యటనలో మంత్రి నారా లోకేష్ కూటమి పార్టీల మధ్య సమన్వయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం బాగుందని, చిన్నచిన్న సమస్యలు తలెత్తితే చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని తెలిపారు. ఇదే అంశంపై గతంలోనూ లోకేష్ కూటమి మూడు పర్యాయాలు కలిసి పోటీ చేస్తామని పేర్కొన్నారు..
కూటమి పార్టీల అధినేతలుగా తమ మధ్య ఎలాంటి సందేహాలు లేవని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.. ఏదైనా విషయంలో తనకు సందేహం వస్తే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు నేరుగా ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పారు. పార్టీల మధ్య చిన్నచిన్న సమస్యలు ఉన్నా కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్, విడాకులు ఉండవు” అంటూ కూటమి కొనసాగింపుపై తన అభిప్రాయాన్ని లోకేష్ వ్యక్తం చేశారు. కూటమి భాగస్వాముల మధ్య సమన్వయం విషయంలో స్పష్టత ఉందని తెలిపారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలంటే కూటమి పార్టీలు మరో మూడు దఫాలు కలిసి పోటీ చేయాల్సిన అవసరం ఉందని లోకేష్ పేర్కొన్నారు. దీనిపై తమకు స్పష్టమైన అవగాహన ఉందని, కూటమి పార్టీల మధ్య కోఆర్డినేషన్ బాగుందని అన్నారు. నెల్లూరులో పార్టీ కార్యకర్తల సమావేశంలోనూ లోకేష్ కూటమి కొనసాగింపుపై మాట్లాడారు. ఇక, 2029 ఎన్నికల్లోనూ కూటమి ప్రభుత్వం కలిసి పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని, ఎన్నికల్లో గెలిస్తేనే ప్రజలకు మరింత సేవ చేయగలమని సూచించారు.. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ఎన్డీఏ జెండా ఎగరాలని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ నూటికి నూరు శాతం విజయం సాధించేలా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు మంత్రి నారా లోకేష..

