Anil Ambani: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో కోస్టల్ ఆంధ్ర పవర్ లిమిటెడ్ కంపెనీకి కేటాయించిన భూములను జిల్లా రెవెన్యూ అధికారులతో కలిసి రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ అంబానీ పరిశీలించారు. అనిల్ అంబానీ పర్యటనను అధికారులు గోప్యంగా ఉంచారు. కంపెనీ ప్రతినిధులతో కలిసి అనిల్ అంబానీ.. కృష్ణపట్నంకు చేరుకున్నారు. కృష్ణపట్నం పోర్టుకు సమీపంలోని ఈ ప్రాంతం వద్ద విద్యుత్ పవర్ ప్లాంట్ స్థాపన కోసం గతంలో 2 వేల700 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అనిల్ అంబానీ సంస్థకు కేటాయించింది. కానీ, నిర్ణీత వ్యవధిలో విద్యుత్తు ప్లాంట్ పనులను చేపట్టకపోవడంతో ఆ భూములను వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం అనిల్ అంబానీకి నోటీసులు జారీ చేసింది. మారిన పరిస్థితుల్లో విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం లాభదాయకత కాదని కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆ భూములను ప్రత్యామ్నాయ పరిశ్రమలకు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో అనిల్ అంబానీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. విద్యుత్ ప్లాంట్ స్థానంలో ఇతర పరిశ్రమలను స్థాపిస్తామని అనిల్ అంబానీ యోచిస్తున్నారు. తాను ఏర్పాటు చేయ తలపెట్టిన పరిశ్రమల గురించి అధికారులతో చర్చించినట్టు తెలిసింది.
Read Also: CM Chandrababu: భారతీయుల గోల్డెన్ ఎరా మొదలైంది.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..