NTV Telugu Site icon

గంజాయి సాగు, రవాణా కట్టడే మా టార్గెట్

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి మత్తు వేధిస్తోంది. ప్రతిరోజూ ఏదో ఒకచోట గంజాయి పట్టుబడుతూనే వుంది. విశాఖ మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో గంజాయి సాగు, రవాణా అరికట్టే పనిలో నిమగ్నం అయ్యారు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్ లాల్ విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగును నిర్మూలించే పనిలో బిజీ అయ్యారు. ఇందుకోసం ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ప్రభుత్వ శాఖల సమన్వయంతో పోలీసులు,ఎస్‌ఈబీ బృందాలు గంజాయి పంటను ధ్వంసం చేస్తున్నారని స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్ లాల్ అన్నారు.

విశాఖ ఏజెన్సీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దులో శుక్రవారం మండలంలోని లోతుగెడ్డ పంచాయతీ, మేడూరు గ్రామంలో తమ శాఖ చేపడుతున్న గంజాయి ద్వంసాన్ని ఆయన పరిశీలించారు. చింతపల్లి,జికె వీధి మండలాల్లో గత 11 రోజులుగా సుమారు 2,100 ఎకరాలకు పైగా గంజాయి సాగు నాశనమైందన్నారు. మేడూరు గ్రామంలోని సుమారు 72 ఎకరాల గంజాయి పంటను ధ్వంసం చేశారన్నారు.

సాగు చేసిన గంజాయి తోటలను ధ్వంసం చేసిన మేడూరు గ్రామ సర్పంచ్‌కు నగదు బహుమతిని అందజేశారు. ఐటీడీఏ ద్వారా ప్రత్యామ్నాయ పంటలకు సహకారం అందిస్తామన్నారు.గంజాయి సాగు,రవాణా ఆపడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు.గంజాయి సాగు విధ్వంసం కొనసాగుతునే వుంటుందన్నారు.గంజాయి స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు పోలీసులు, ఎస్‌ఈబీ బృందాలు రాష్ట్రంలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాయని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బి కృష్ణారావు,ఎస్ఈబి జెడి ఎస్ సతీష్ కుమార్,ఎఎస్పీ తుషార్ డూడి,సిఐ టి శ్రీనువాసు,అన్నవరం ఎస్ఐ ఎన్ ప్రశాంత్ కుమార్,సిబ్బంది పాల్గొన్నారు.