Somu Veerraju: ఏపీలో వినాయక చవితి పండగ సందర్భంగా ఆంక్షలు విధించారంటూ వస్తున్న వార్తలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితికి ప్రభుత్వం విధించిన ఆంక్షలు యావత్ ఆంధ్ర ప్రదేశ్ నివ్వెరపోయేలా ఉన్నాయని ఆరోపించారు. ప్రస్తుతం వినాయక చవితికి పందిరి వేసుకుంటే ఫైర్, విద్యుత్, పోలీసుల పర్మిషన్ కావాలని.. చందాలు అడగాలన్నా పర్మిషన్ కావాలని, అసలు ఈ ప్రభుత్వం మనలో పుట్టిందా లేదా అమెరికా నుంచి ఏమైనా వచ్చిందా అనిపిస్తుందని సోము వీర్రాజు చురకలు అంటించారు.
Read Also: Chiranjeevi: ఆ స్థలాన్ని అమ్మేసిన చిరు.. కారణం ఏంటి..?
వినాయక చవితి అనాదిగా వచ్చిన పండగని, ఏ రాజకీయ పార్టీ ప్రవేశపెట్టిన పండగ కాదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. నిత్యజీవితంలో వినాయకుని పూజించి ఏ కార్యక్రమమైనా చేస్తామని, అలాంటిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వినాయక పూజకు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుందన్నారు. హిందువులు ఎవరు వినాయక చవితి సరిగా చేయకూడదనే భావన ఈ ప్రభుత్వంలో కనిపిస్తుందన్నారు. ఈ ప్రభుత్వ వైఖరిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ఎటువంటి ఆంక్షలు లేకుండా గతంలో లాగా అందరూ పండుగ చేసుకునే విధంగా తమ పార్టీ ధైర్యాన్ని ఇస్తుందన్నారు. మరోవైపు ఇటీవల హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీపై సోము వీర్రాజు స్పందించారు. రాజకీయాలలో ఏదైనా జరగొచ్చని, పార్టీ వ్యూహత్మకంగా వెళ్లే విషయంలో అనేక కార్యక్రమాలు జరుగుతాయని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని అభివృద్ధి చేయాలనేది కేంద్ర పార్టీ లక్ష్యమని, కేంద్ర పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న పార్టీ కార్యకర్తలుగా, సైనికులుగా పనిచేస్తూ ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.
