Somu Veerraju: జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మచిలీపట్నం వేదికగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో పొత్తులపై ఆసక్తికర కామెంట్లు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇక, పవన్ కల్యాణ్ కామెంట్లపై స్పందించిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. కీలక వ్యాఖ్యలు చేశారు.. కృష్ణా జిల్లా గుడివాడలో జిల్లా స్థాయి భారతీయ జనతా పార్టీ బూత్ స్వశక్తి కిరణ్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న సోము వీర్రాజు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనసేన, తెలుగుదేశం పొత్తుపై పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడలేదని గుర్తుచేశారు.. పవన్ బీజేపీతో పొత్తిపైనే మాట్లాడడం జరిగిందన్న ఆయన.. టీడీపీతో పొత్తుపై జనసేన పార్టీ క్లారిటీ ఇచ్చిన తర్వాత.. తమ భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తాం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు..
Read Also: Gudivada Amarnath: జనసేనాకు పదేళ్లుగా అజెండా లేదు.. ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదు
ఇక, రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో శక్తి కేంద్ర ఆధారిత పాదయాత్రను నిర్వహిస్తాం అన్నారు సోము వీర్రాజు.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్ర రాష్ట్రంలో ఈ మాత్రం అభివృద్ధి అయినా జరుగుతుంది.. 8,16, 503 కోట్ల రూపాయలతో 503 మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం 2020వ సంవత్సరంలోనే కేంద్రం ఆమోదముద్ర వేసిందని తెలిపారు.. కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధానిగా గుర్తించి ఈ ప్రాంత అభివృద్ధి, పరిశ్రమల నిర్మాణానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన.. ఈ రోజు విశాఖ క్యాపిటల్ అంటూ ప్రజలను మభ్య పెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిందన్నారు సోము వీర్రాజు. కాగా, జనసేన-బీజేపీ పొత్తుపై ఆవిర్భావ సభా వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించిన విషయం విదితమే.. నేను బీజేపీతో పొత్తులో ఉంటే ముస్లింలు నాకు దూరం అవుతారని కొందరు అంటున్నారు.. కానీ, వారికి ఇష్టం లేకపోతే నేను బీజేపీకి దూరంగా జరుగుతాను అని స్పష్టం చేశారు.. ఇక, పొత్తులో ఉంటే మాత్రం.. ఎక్కడైనా మైనార్టీలపై దాడి జరిగితే చూస్తూ ఊరుకోను.. వెంటనే పొత్తు నుంచి బయటకువస్తానని మాట ఇస్తున్నా.. మళ్లీ చెబుతున్నా ముస్లింలపై ఎవరు దాడులు చేసినా సరే ఊరుకునేది లేదు.. తాట తీస్తాను అంటూ పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చిన విషయం విదితమే.