NTV Telugu Site icon

Somu Veerraju: నగదు బదిలీ పేరుతో వైసీపీ సర్కారు కొత్త నాటకం

Somu Veerraju

Somu Veerraju

జగన్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో రేషన్ బియ్యం బదులు ప్రజలకు నగదు ఇస్తామని ప్రభుత్వం చెప్పడంలో కుట్ర కోణం దాగి ఉందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం పేదల జీవితాలతో ఆటలాడుతోందంటూ మండిపడ్డారు. నగదు బదిలీ విషయంలో ప్రజలపై బలవంతంగా ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోందని విమర్శలు చేశారు. ఈ అంశంపై అధికారులు సర్వే నిర్వహిస్తే ఎక్కువ మంది బియ్యమే కావాలని కోరుతున్నారని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు.

ఉదాహరణకు ఏపీలోని గాజువాక, అనకాపల్లి, నర్సాపురం, కాకినాడ, నంద్యాల వంటి ప్రాంతాల్లో అధికారులు సర్వే నిర్వహిస్తే మెజార్టీ ప్రజలు బియ్యమే కావాలంటున్నారని సోమువీర్రాజు వెల్లడించారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో కూడా రేషన్ లబ్దిదారులు నగదు కోరుకోవడం లేదని.. బియ్యమే కావాలంటున్నారని స్పష్టం చేశారు. ఇంటింటికి రేషన్‌ పథకాన్ని అటకెక్కించేందుకే ప్రభుత్వం కొత్త నాటకం ఆడుతుందన్నారు. పోర్టుల ద్వారా రేషన్ బియ్యాన్ని విదేశాలకు పంపించే ప్రయత్నం చేస్తోందని సోము వీర్రాజు విమర్శలు చేశారు.

Chandrababu: ఎన్నికల మూడ్‌లోకి చంద్రబాబు.. పుట్టినరోజు నుంచే మొదలు

Show comments