Site icon NTV Telugu

Somu Veerraju: సీఎం జగన్‌కు సోము వీర్రాజు లేఖ.. భూ అక్రమాలపై సిట్ నివేదిక ఏమైంది?

Somu Veerraju

Somu Veerraju

Somu Veerraju: ఏపీ సీఎం జగన్‌కు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మంగళవారం ఉదయం లేఖ రాశారు. ఈ సందర్భంగా 2004 నుంచి విశాఖలో, ఉత్తరాంధ్రలో జరిగిన భూ అక్రమాలపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని లేఖలో కోరారు. విశాఖ నగరం, పరిసర ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భూ అక్రమాలు జరుగుతున్నాయని.. ప్రభుత్వ, ప్రైవేటు, దేవాదాయ శాఖకు చెందిన భూములే కాదు సామాన్యుల భూములకు రక్షణ లేకుండా పోయిందని సోము వీర్రాజు ఆరోపించారు. స్వాతంత్ర్య సమరయోధులు, వారి కుటుంబాలకు, మాజీ సైనిక ఉద్యోగులకు కేటాయించిన భూములను కూడా కబ్జా చేస్తున్నారని విమర్శలు చేశారు.

Read Also: Reliance Jio: దేశవ్యాప్తంగా జియో సేవలకు అంతరాయం

విశాఖ భూ అక్రమాలపై దర్యాప్తు చేయాల్సిన అంశాలపై ప్రభుత్వం దోబూచులాడుతోందని సోము వీర్రాజు అన్నారు. విశాఖ భూ అక్రమాల్లో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందన్నారు. 2004లో అప్పటి సీఎం వైఎస్ఆర్ హయాం నుంచి విశాఖలో భూదందా మొదలైందని.. చంద్రబాబు హయాంలో భూ అక్రమాలు జరిగాయని ప్రతిపక్షంగా వైసీపీ కూడా ఆరోపించిందని గుర్తుచేశారు. ఆ తర్వాత వైసీపీ హయాంలోనూ భూ అక్రమాలు జరిగాయన్నారు. విశాఖ భూ అక్రమాల్లో వైసీపీ ప్రభుత్వ పాత్ర లేకుంటే చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని.. విచారణకు సిద్ధపడాలని సీఎం జగన్‌కు సూచించారు.

వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్ హయాంలలో కొందరు ప్రజా ప్రతినిధులు కలిసికట్టుగా ప్రజలను దోచుకున్నారనే ప్రచారం ఉందని.. నాటి తెలుగుదేశం ప్రభుత్వం భూ కబ్జాలపై విచారణకు ‘సిట్’ వేసింది కానీ కమిటీ నివేదిక బహిర్గతం కాకుండానే ఎన్నికలు వచ్చాయని సోము వీర్రాజు చెప్పారు. గత ప్రభుత్వ దురాక్రమణలపై వైసీపీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయిస్తుందని ప్రజలు వేచి చూశారన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడున్నరేళ్లు గడుస్తున్నా విచారణలోని అంశాలను ఎందుకు బహిర్గతం చేయట్లేదని ప్రశ్నించారు. నాటి సిట్ నివేదిక‌ ఏమైందని.. ప్రభుత్వ విచారణ ఏమైందో చెప్పాలన్నారు. ఈ బహిరంగ లేఖను మీ స్పందనలో వచ్చిన అత్యవసర ఫిర్యాదుగా స్వీకరించాలని సోము వీర్రాజు కోరారు. తక్షణమే ఉత్తరాంధ్ర భూ కబ్జాల మీద స్పందించాలని డిమాండ్ చేశారు.

Read Also: Ex Russian Minister Arrest: డెహ్రాడూన్ ఎయిర్‌పోర్టులో రష్యా మాజీ మంత్రి అరెస్ట్.. ఎందుకంటే?

Exit mobile version