రాష్ట్రానికి సూడో విద్యుత్ శాఖ మంత్రిగా షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ వ్యవహరిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీకాంత్ సీఎం చెప్పారని విద్యుత్ శాఖ బాధ్యతలన్నీ షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ కు అప్పగించారన్నారు. విద్యుత్ శాఖకు అవసరమైన అనేక పరికరాలు ఎక్కువ ధరకు ఈ షిరిడీ సాయయే సంస్థే సరఫరా చేస్తోందని, విద్యుత్ శాఖలో ముగ్గురు సీఎండీల నియామకం కూడా కడప రెడ్డికి చెందిన షిరిడిసాయి సంస్థ ప్రభావమేనని ఆయన మండిపడ్డారు. విద్యుత్ శాఖలో నష్టాలు పెరిగేందుకు కారణం ప్రభుత్వ అసమర్థత, షిరిడిసాయి సంస్థ పెత్తనమేనని ఆయన ఆరోపించారు. కృష్ణపట్నంలో దామోదర సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ ప్రైవేటీకరించాలనుకోవటం దుర్మార్గమని ఆయన విమర్శించారు.
కాలుష్యం తగ్గిస్తూ విద్యుతుత్పత్తి చేసే తొలి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ను అదానీ చేతుల్లో పెట్టడాన్ని ఒప్పుకోమని, 25 ఏళ్లకు విద్యుత్ ప్లాంట్ ను లీజుకివ్వటాన్ని వ్యతిరేకిస్తూ పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 3వేల మంది బతుకులు ఆ విద్యుత్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నాయని, చేతకానితనం, అసమర్థతతో నడపలేమంటూ ప్రైవేటీకరిస్తామంటున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. అరబిందో బంధువులకు చెందిన నాలెడ్జ్ సంస్థ రూ.700కోట్లు నష్టం చేకూర్చేలా ఎర్రమట్టి కలిసిన నాశిరకం బొగ్గు విద్యుత్ ప్లాంట్ కు సరఫరా చేసినా చర్యలు లేవని, బొగ్గుసరఫరా చేసిన వారికి సంవత్సరం ఆలస్యంగా చెల్లింపులు చేస్తూ, బొగ్గును ఎక్కువ ధరకు కొనుగోళ్లు చేస్తున్నారని ఆయన అన్నారు. అదానీకి మాత్రం ఇందుకు భిన్నంగా నెలవారీ చెల్లింపులకు బ్యాంకుల ద్వారా ఎల్సీ ఇస్తున్నారని, భూములిచ్చి నిర్వాసితుల ప్రయోజనాలు గాలికొదిలేశారని ఆయన వ్యాఖ్యానించారు.