నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని శ్రీ దామోదర సంజీవయ్య థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద కార్మికులకు టీడీపీ, సీపిఐ, సీపీఎం అఖిలపక్ష నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. భారత దేశంలోనే సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన విద్యుత్ కేంద్రాన్ని ప్రైవేటీకరణ చేయడం సిగ్గు చేటని ఆయన మండి పడ్డారు. అధికార దుర్వినియోగం తోనే బూడిద తోట్టెలు కూలిపోయాయని, విద్యుత్ ఉత్పత్తి ఆగిపోవడంతో రోజుకు రూ.10 కోట్ల మేర నష్టం వస్తోందని ఆయన అన్నారు.
పోర్ట్ లు లేని తెలంగాణ రాష్ట్రంలో సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తూ వుంటే ప్రక్కనే.. కృష్ణ పట్నం ఓడరేవు పెట్టుకుని పవర్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడం ప్రభుత్వం చేతకాని తనానికి నిదర్శమని ఆయన దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో టన్ను బొగ్గు ఐదు వేల రూపాయలేనని, ప్రస్తుతం ఆదానీ వద్ద టన్ను ఇరవై నాలుగు వేల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.