ఏపీ జెన్‌కో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నెల్లూరులో టీడీపీ, సీపీఎం, సీపీఐ, కార్మిక సంఘాల నేతల సమావేశం జరిగింది. ఈ మేరకు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, మోహన్ రావు, అంకయ్య, రామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
ఏపీ జెన్‌కో సంస్థను ఆదానీ కంపెనీ పరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని సోమిరెడ్డి ఆరోపించారు. జెన్ కో ప్లాంట్‌లో ప్రమాదాన్ని ముందే హెచ్చరించిన అధికారులని బెదిరించారని మండిపడ్డారు. యాష్ పాండ్ ప్రమాదం వల్ల రెండు యూనిట్లు మూసేశారన్నారు. దీంతో రోజుకు రూ.10 కోట్ల నష్టం వస్తోందని సోమిరెడ్డి వివరించారు. ప్రస్తుతం ఆత్మకూరు ఉప ఎన్నిక కారణంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉందని.. ఉప ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఆయన పేర్కొన్నారు.
Ambati Rambabu: చంద్రబాబు, దేవినేని ఉమాకు సవాల్.. చర్చకు సిద్ధమా?
అటు జెన్‌కో ప్లాంట్‌లో బూడిద తొట్టి వద్ద ప్రమాదానికి కారణం కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యమేనని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో యాజమాన్యం తీరు వల్లే రూ.కోట్ల మేర నష్టం వాటిల్లిందని అఖిలపక్ష నేతలు తెలిపారు. వెంటనే మూడు యూనిట్లను వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.