Sake Sailajanath Demands YS Jagan To Declare Amaravati As AP Capital: చంద్రబాబు తన హయాంలో ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పుడు జై కొట్టిన సీఎం జగన్.. ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. తల తిక్క వ్యవహారాలను ప్రభుత్వం మానుకోవాలని, రాజధాని విషయంలో చేతకాని విధానాలను విడనాడాలని కోరారు. ఈ భూమ్మీద రాజధాని లేని ఏకైకా రాష్ట్రం ఏమీ మాత్రమేనన్నారు. ఏపీ మంత్రులు తగ్గేదేలే అని బీరాలు పోతున్నారని.. ఇదంతా ఎవరి కోసం, ఎందుకు చేస్తున్నారో చెప్పాలని కోరారు. రాష్ట్ర రాజధాని అందరికీ అందుబాటులో ఉండాలనేదే కాంగ్రెస్ విధానమన్నారు.
‘‘అప్పుడు అమరావతిని రాజధానికి చంద్రబాబు ప్రకటిస్తే జగన్ మద్దతు ఇచ్చారు. ఈలోపు చంద్రబాబుతో ఏం గొడవ వచ్చిందో జగన్ చెప్పాలి’’ అని సాకే శైలజానాథ్ అడిగారు. అమరావతిని ప్రకటించినప్పుడు రాయలసీమ వాసులుగా తమకూ అప్పుడు ఇబ్బంది కలిగిందని.. అయితే ఏపీ ప్రజల మేలు కోరి తాము అమరావతికి అండగా నిలిచామని అన్నారు. సీఎంగా జగన్ ప్రజల్లో, రోడ్ల మీద తిరిగితే.. వాస్తవాలు తెలుస్తాయన్నారు. శ్రీభాగ్ ఒప్పందంపై జగన్‌కు కనీస అవగాహన లేదని.. అసలు రాష్ట్ర అభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఎద్దేవా చేశారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటిస్తే జగన్‌కే మంచిదని.. జగన్ తన ఆలోచనా విధానాలను, మొండి పట్టుదలను వీడాలని కోరారు. మాట తప్పనన్న జగన్.. అమరావతి విషయంలో అన్నీ అబద్దాలే చెప్తున్నారన్నారు. న్యాయ రాజధాని, శాసన రాజధాని, పాలన రాజధాని అనేది ప్రజల మధ్య విద్వేషాల కోసమేనన్నారు. జగన్ రాజకీయ డ్రామాలు ఆపి, అమరావతిని తక్షణమే అభివృద్ధి చేయాలని నిలదీశారు.
జగన్ వైఫల్యాలను విమర్శిస్తే దాడులు చేస్తారా..? పోలీసులను అడ్డం పెట్టుకుని అరెస్టులు చేయిస్తారా..? అంటూ సాకే శైలజానాథ్ మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా చంపేసి, మూడు రాజధానులు అనడం సహేతుకమా..? అని ప్రశ్నించారు. పేర్లు పెట్టడం వేరు, పనులు పూర్తి చేయడం వేరని తెలిపారు. ప్రజల కష్టాలు పట్టించుకోని ప్రభుత్వాలు ఉండటం మన దురదృష్టమన్నారు. అటు బీజేపీ ప్రభుత్వం కుల, మత విద్వేషాలను రెచ్చ గొడుతోందని ఆగ్రహించారు. మోదీ, జగన్ నిరంకుశ పాలనను సాగిస్తున్నారని ఫైర్ అయ్యారు. వీటిని ఎదుర్కునేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని, ఆ యాత్రకు ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇది రాజకీయ యాత్ర కాదని.. అందరినీ సంఘటితం చేసే యాత్ర అని చెప్పారు. దేశాన్ని, రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే సత్తా ఒక్క రాహుల్ గాందీకే ఉందని శైలజానాథ్ వెల్లడించారు.
