Sajjala Ramakrishna Reddy Reacts To CM KCR Comments: తెలంగాణతో పాటు ఏపీ ప్రభుత్వాన్ని కూడా కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. అసలు తెలంగాణ రాజకీయాలకు, ఏపీ రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదని తేల్చి చెప్పారు. బహుశా తెలంగాణ రాజకీయ పరిస్థితుల కోణంలో కేసీఆర్ ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చేమో గానీ.. ఏపీలో మాత్రం అలాంటి సిచ్యువేషన్ లేదన్నారు. అభివృద్ధి అజెండాతో మాత్రమే వైసీపీ ప్రభుత్వం పని చేస్తోందని, ఇతర రాష్ట్రాల వ్యవహారాల గురించి తాము పట్టించుకోబోమని వెల్లడించారు. తెలంగాణ నేతల వ్యాఖ్యలు వారి రాష్ట్రానికే పరిమితమని పేర్కొన్నారు. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు సీఎం జగన్‌కు ఆసక్తి లేదన్నారు. ఏపీ ప్రజలు తమకు ఐదేళ్లు అవకాశం ఇచ్చారని.. ఈ ఐదేళ్ల కాలంలో శక్తిమేర పనిచేసి, ప్రజా దీవెనలు కోరతామన్నారు. ముందస్తు ఎన్నికలు రావొచ్చని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఇది కేవలం రాజకీయ ఎత్తుగడేనని స్పష్టం చేశారు.
ఇక ఇదే సమయంలో.. తనకు చివరి ఎన్నికలు ఇవేనంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సజ్జల మరోసారి ధ్వజమెత్తారు. తనకు చివరి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు ప్రజలను కోరుతున్నారని.. కానీ, ప్రజాస్వామ్యంలో ఇలాంటి కుదరవని తేల్చి చెప్పారు. నాయకుడుగా ఆయన తమకు ఎంతవరకు పనికొస్తాడన్నది ప్రజలు ఆలోచిస్తారని, చంద్రబాబు ఏడ్చినంత మాత్రాన ఆయనపై జాలి చూపడమనేది ఉండదన్నారు. అంతకుముందు.. దింపుడు కళ్లెం ఆశలా ప్రజల్ని చంద్రబాబు తనకు మరో ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులు, ఏడుపులు, పెడబొబ్బలకు విలువ ఉండదన్నారు. ఒకటికి పదిసార్లు తన భార్య పేరుని ప్రజల్లో చెప్పి, చంద్రబాబే ఆమెను అవమానిస్తున్నారని.. బహుశా చంద్రబాబు ప్రవర్తనకు ఆమె కూడా కుమిలిపోతూ ఉంటారేమోనని సందేహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాటల్లో.. అధికారం నా హక్కు అన్న ధోరణితో పాటు పొగరు కనిపిస్తోందన్నారు. ఎవరైనా చంద్రబాబు భార్యను అవమానిస్తే.. ప్రజలు ఎందుకు ఆయనకు ఓట్లు వేయాలి? అని ప్రశ్నించారు.
