NTV Telugu Site icon

Sajjala Ramakrishna Reddy: ఏంటి ఆ బరి తెగింపు..? పవన్‌లా చంద్రబాబుకు కూడా ఆ కోరిక ఉన్నట్లుంది..!

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. ఆగ్రహంతో ఊగిపోయిన చంద్రబాబు.. పోలీసులు, వైసీపీ కార్యకర్తలకు వార్నింగ్‌ ఇచ్చారు.. అయితే, చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. కర్నూలులో చంద్రబాబు విన్యాసాలను ప్రజలు అందరూ చూశారన్న ఆయన.. ముఖ్యమంత్రి, పార్టీ నేతల మీద చివరకు ప్రజల మీద కూడా బూతులతో దాడి చేశారని విమర్శించారు.. చంద్రబాబుకు ఎందుకు అంత కోపం వచ్చింది? అని ప్రశ్నించిన ఆయన.. పవన్ కల్యాణ్‌ కూడా ఆ మధ్య పూనకం వచ్చినట్టు ఊగిపోయారు.. పవన్‌ కల్యాణ్‌ లా చంద్రబాబుకు కూడా చెప్పు చూపించాలని కోరిక ఉన్నట్లు ఉంది అంటూ ఎద్దేవా చేశారు.. న్యాయ రాజధానిపై మీ విధానం ఏంటి అని సీమ ప్రజలు, పౌర సమాజం చంద్రబాబును నిలదీసిందని.. ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.. అప్పుడే నాయకులు అవుతారు? అమరావతిలోనే కేంద్రీకృత రాజధాని ఎందుకు అవసరమో ప్రజలకు చెప్పే అవకాశం చంద్రబాబుకు వచ్చింది.. కానీ, చంద్రబాబు మాత్రం ఊగిపోయారని మండిపడ్డారు.

Read Also: Manika Batra: మనిక బాత్రా రికార్డు.. ఆసియా కప్‌ టీటీ ఈవెంట్‌లో కాంస్యం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా వికేంద్రీకరణ అభివృద్ధి జరిగి ఉంటే రాష్ట్ర విభజన ఇంత చేదుగా ఉండేది కాదన్నారు సజ్జల.. అమరావతిలో చంద్రబాబు చెప్పే లక్ష కోట్ల రాజధాని కట్టడం అసాధ్యం.. అమరావతి ఒక భ్రమ అని స్పష్టం చేశారు. రౌడీలకు రౌడీని అనే వ్యాఖ్యలు ఏంటి? చంద్రబాబుకు అంత బరి తెగింపు ఏంటి? అని మండిపడ్డారు.. టీడీపీ అంటే తిట్లు, దూషణలు, పచ్చి బూతులు.. వాళ్లే దాడి చేసి వాళ్లే బట్టలు చించుకుని బయటకు వచ్చి అరుస్తారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, చిట్ ఫండ్స్ లో అక్రమాలను పెట్టుకుంటే కక్ష సాధింపు అంటారు.. మీరు అన్నింటికీ అతీతమా? అని ప్రశ్నించారు.. వచ్చే ఎన్నికలు ప్రజలకు చివరి అవకాశమని మాట్లాడుతున్నారు.. ఇదేం కర్మ రా బాబు అని చెబితే సరిగ్గా సరిపోతుంది.. తన హయాంలో ప్రజలకు నిజంగా మంచి చేసి ఉంటే అదే చెప్పుకోవచ్చు.. ఏమీ చేయలేదు కనుకే ప్రజలు ప్రతిపక్షంలో కూర్చో బెట్టారని ఎద్దేవా చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.

అమరావతిలోనే రాజధాని ఉండాలని వైఎస్‌ జగన్ ఎప్పుడూ చెప్పలేదన్నారు సజ్జల.. అప్పుడు చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు.. చంద్రబాబు చెప్పిన మాట ప్రకారం రాజధాని పూర్తి చేసి ఉంటే అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుని ఉండేవారన్నారు.. రాష్ట్ర బడ్జెట్ అంతా ఈ 29 గ్రామాల్లోనే పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. చంద్రబాబు ఒక్కడే నాయకుడు మిగిలిన పార్టీలన్నీ ఉడతలనా అర్థం? అంటూ ఫైర్‌ అయ్యారు.. వారి మాటల్లోనే అహంకారం కనిపిస్తోంది.. ఉడతలన్నీ కష్టపడి చంద్రబాబును పల్లకీలో కూర్చోబెట్టాలా? అని నిలదీశారు.. అసలు వికేంద్రీకరణ పై చంద్రబాబు స్టాండ్ ఏంటో చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.