పొత్తులు.. ఎత్తులు.. లాంటి చచ్చు ఆలోచనలు మాకు లేవు అని స్పష్టం చేస్తూనే.. టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ఎప్పుడూ ముందస్తు ఎన్నికలు అంటున్నారు.. పార్టీలో ఊపులేక చంద్రబాబు ముందస్తు మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.. ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదని స్పష్టం చేసిన ఆయన.. హామీలు అమలు చేసి ఐదేళ్లు పూర్తి అయ్యాక ప్రజలకు చెప్పి ఎన్నికలకు వెళ్తామన్నారు.. పొత్తులు, ఎత్తులు, లాంటి చచ్చు ఆలోచనలు మాకు లేదంటూ మండిపడ్డారు. కార్యకర్తల్లో ఉత్సాహం కోసం చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Earthquake: పాల్వంచలో భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన జనం
ఇక, కౌలు రైతులకు సంబంధించి మెరుగైన విధానం ఏదైనా ఉంటే పవన్ కల్యాణ్ చెప్పచ్చు అని సవాల్ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.. కౌలు రైతులకు ప్రభుత్వం సహాయం అందిస్తోందని స్పష్టం చేశారు.. కౌలు రైతుల విషయంలో జనసేన నేతలు చేస్తున్న కామెంట్లపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు.. మరోవైపు.. సుప్రీంకోర్టులో రాష్ట్ర విభజనకు సంబంధించి విచారణ జరుగుతోంది.. గత మూడేళ్లుగా రాష్ట్ర విభజన సమస్యల గురించి వివిధ వేదికలపై గళం వినిపిస్తూనే ఉన్నాం.. ప్రత్యేక హోదాపై కేంద్ర వైఖరి మోసం, అన్యాయం అని ఆరోపించారు. రాజకీయపరమైన నిర్ణయం జరగాలి.. ప్రత్యేక హోదా కోసం ప్రతి వేదికపై నుంచి మా గళం వినిపిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.
