Site icon NTV Telugu

Sajjala Ramakrishna Reddy: బీజేపీ నేతలు ముందు ఆ ధరల గురించి మాట్లాడాలి

ఏపీలో కరెంట్ ఛార్జీల పెంపును వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమర్థించుకున్నారు. తమ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలో ఒకసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు కూడా ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో హేతుబద్దంగా స్వల్పంగా మాత్రమే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నామన్నారు. 100 యూనిట్ల లోపు విద్యుత్ ఛార్జీలు ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే తక్కువగా ఉన్నాయని సజ్జల అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు అర్ధం చేసుకుంటారనే నమ్మకం ఉందన్నారు.

అయితే విద్యుత్ ఛార్జీల పెంపుపై టీడీపీ గోబెల్స్ ప్రచారం ప్రారంభించిందని సజ్జల ఆరోపించారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని ఘనంగా ప్రకటించారని.. ఆయన హయాంలో పెంచిన రేట్లను ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలన అంత అద్భుతంగా ఉంటే ప్రజలు ఎందుకు 23 స్థానాలకు పరిమితం చేస్తారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్, బీజేపీ, చంద్రబాబు ఒకే గూటి పక్షులు అని సజ్జల అభివర్ణించారు.

జయము జయము చంద్రన్న అని పోలవరం ప్రచార పాటల కోసమే వందల కోట్లు ఖర్చు పెట్టిన చరిత్ర టీడీపీది అని సజ్జల విమర్శించారు. టీడీపీది ఐదేళ్ళ బాధ్యతా రాహిత్య ప్రభుత్వమన్నారు. ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీదే పడుతుందని చంద్రబాబు తెలుసుకోవాలని సజ్జల హితవు పలికారు. కరెంట్ ఛార్జీల గురించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు ముందు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల గురించి మాట్లాడాలని సజ్జల సూచించారు. పెట్రోల్, డీజిల్ రేట్లు మీటర్‌లా తిరుగుతూనే ఉన్నాయని.. వాటి గురించి బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడరని సజ్జల ప్రశ్నించారు.

https://ntvtelugu.com/somireddy-chandramohan-reddy-sensational-comments-on-liquor-sales-in-nellore/
Exit mobile version