Sajjala: వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్రకు నాలుగేళ్లు పూర్తయిన నేపథ్యంలో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. టీడీపీ, జనసేన పొత్తుపై సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంలో లేరని స్పష్టం చేశారు. ప్రజలు ఐదేళ్ళ కాలానికి తీర్పు ఇచ్చారని.. జగన్ పూర్తి కాలం పాలిస్తారని తెలిపారు. ప్రతిపక్షాలు తాము సజీవంగా ఉన్నామని చెప్పటానికి ముందస్తు ప్రకటనలు చేస్తున్నారని చురకలు అంటించారు. ప్రతిపక్ష నేతలు రహస్యంగా ఎందుకు సమావేశాలు అవుతున్నారని ప్రశ్నించారు. తమ అక్రమ సంబంధాలను సక్రమం అని చెప్పటానికి ప్రయత్నిస్తున్నారని సజ్జల ఎద్దేవా చేశారు.
Read Also: Ram Gopal Varma: కాపులకు RIP.. కమ్మోళ్లకు కంగ్రాట్స్..!!
చంపిన వాళ్ళను పరామర్శించటం ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. 11 మంది ప్రాణాలు తీసిన వ్యక్తిని పవన్ కళ్యాణ్ పరామర్శించటం సిగ్గుచేటన్నారు. చనిపోయిన కుటుంబాలను పవన్ కళ్యాణ్ ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. జనసేన, టీడీపీ కలవటాన్ని వామపక్షాలు స్వాగతించటం విచిత్రంగా ఉందన్నారు. బీజేపీ కూడా కలిస్తే వామపక్షాలు ఏ వైఖరి తీసుకుంటాయో చూడాలన్నారు. అప్పుడు ఎరుపు, కాషాయం కలిసి పసుపు అవుతుందేమోనని కౌంటర్ ఇచ్చారు. అయితే ఎంత మందిని కలిసినా మంచిదే అని.. పంది కొక్కులు, ఎలుకలు, అన్నీ కలిస్తే ఎవరి విలువలు ఏంటో మరోసారి బయటపడుతుందని సజ్జల అభిప్రాయపడ్డారు. అందరినీ కలిసి ఒకేసారి ఓడించే అవకాశం కూడా జగన్‌కు వస్తుందన్నారు.
