Site icon NTV Telugu

Sajjala: ఆ ప్రచారంలో వాస్తవం లేదు.. బాబు అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయి

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy: ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నామని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఓ ప్రభుత్వ విభాగంలో కొద్ది మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తూ ఆదేశాలు వచ్చాయని.. సిబ్బందిని తొలగిస్తూ అధికారులు ఆదేశాలు ఇవ్వడంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని సజ్జల తెలిపారు. ఇచ్చిన ఆదేశాలను వెంటనే ఉపసంహరింపజేయాలని సీఎం ఆదేశించారన్నారు. పంచాయతీరాజ్ డిపార్టుమెంట్‌లోనూ పొరుగు సేవల సిబ్బంది తొలగించారన్న అంశంపైనా విచారణ జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులెవరినీ తొలగించే ప్రసక్తే లేదన్నారు. రాయలసీమకు వైఎస్ఆర్ సహా జగన్ ఏం చేశారనే విషయం అక్కడి ప్రజలకు తెలుసు అని.. వచ్చే ఎన్నికల్లో వాళ్లే సమాధానం చెప్తారన్నారు.

ఎడారి లాంటి పులివెందులలో నీరు నింపి బోటింగ్ కూడా సీఎం జగన్ ప్రారంభించారని సజ్జల వెల్లడించారు. రాయలసీమకు శ్రీశైలం నుంచి వరద జలాలు ఇవ్వాలని కాలువల వెడల్పు చేపట్టారని.. పోతిరెడ్డిపాడు ద్వారా నీరు లిఫ్ట్ చేసేందుకు సీఎం జగన్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి రోజుకు మూడు టీఎంసీలు లిఫ్టింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఎన్జీటీలో కేసు వేసి చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. హంద్రీనీవా, వెలిగొండ పనులను సీఎం జగన్ పూర్తి చేస్తున్నారని.. కుప్పం బ్రాంచి కెనాల్‌ను కూడా చంద్రబాబు పూర్తి చేయకపోతే వైఎస్ జగన్ పూర్తి చేశారన్నారు. ఎన్నడూ లేని విధంగా ఐదు మెడికల్ కళాశాలు రాయలసీమకు వస్తున్నాయని సజ్జల చెప్పారు. క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లు కూడా రాయలసీమకు వస్తున్నాయని చెప్పారు.

Read Also: Nadendla Manohar: పుంగనూరు దాడిని ఖండిస్తున్నాం.. రైతు సభ నిర్వహణ నేరమా?

పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి చంద్రబాబే కారకుడు అని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చేది లేదని.. పోలవరం పూర్తి చేసేది లేదన్నారు. సీఎం వైఎస్ జగన్ హయాంలోనే పోలవరం పూర్తవుతుందన్నారు. ఇప్పటికీ రాజధాని, హైకోర్టు అమరావతిలోనే ఉన్నాయని.. కర్నూలులో హైకోర్టు పెట్టాలన్నది తమ విధానం అన్నారు. రాష్ట్రంలో మూడు రాజధానులు రావడం ఖాయమని సజ్జల స్పష్టం చేశారు. న్యాయ పరిశీలన చేసి పకడ్బందీగా మూడు రాజధానుల బిల్లు శాసన సభలో పెడతామన్నారు. స్కిల్ డెవలప్ మెంట్‌లో చంద్రబాబు, లోకేష్ పాత్ర లేకుండా అవకతవకలు జరిగి ఉండవని.. వాళ్ల అక్రమాలపై ఆధారాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. అవకతవకల్లో ఎవరెవరు ఉన్నారో ఈడీ దర్యాప్తు ఆధారంగా అందరిపైనా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Exit mobile version