ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాయలసీమ రాష్ట్ర సమితి (ఆర్‌ఆర్‌ఎస్) డిమాండ్ చేసింది. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ప్రయత్నించడం సరికాదని ఆర్‌ఆర్‌ఎస్ అధ్యక్షుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మీడియా ప్రకటన విడుదల చేశారు. విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు వల్ల రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందన్నారు. దీనికంటే అమరావతి రాజధానిగా ఉంటేనే రాయలసీమకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
రాయలసీమ ప్రాంత ప్రయోజనాల గురించి ఎవరూ ఆలోచించడం లేదని, కేంద్ర ప్రభుత్వం లేదా న్యాయవ్యవస్థ ప్రభుత్వ ఆలోచనా విధానాన్ని సమర్ధించడం లేదని కుంచం వెంకట సుబ్బారెడ్డి చెప్పారు. విశాఖను రాజధానిగా చేస్తే సరిహద్దులో ఉన్న అనంతపురం జిల్లా మడకశిర ప్రాంతం ప్రజలు ఎలా రాగలుగుతారని ఆయన ప్రశ్నించారు. సాగునీటి రంగం, సమగ్రాభివృద్ధి విషయంలో రాయలసీమ తీవ్ర అన్యాయానికి గురవుతోందని ఆరోపించారు. రాయలసీమ పారిశ్రామికంగా వెనుకబడి ఉందని, ఉపాధి కల్పించే పరిశ్రమలు లేవని ఎత్తిచూపారు. కడప ఉక్కు కర్మాగారం ఎండమావిలా తయారైందని విచారం వ్యక్తం చేశారు. ఐదు రకాల పండ్లను ఎగుమతి చేసేలా అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయవచ్చని సుబ్బారెడ్డి సూచించారు. ఇంతటి అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని మండిపడ్డారు.
